స్వతంత్ర, వెబ్ డెస్క్: కర్నూలు నగర పాలక సమావేశం రసాభాసగా మారింది. కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేవంలో మేయర్ బీవై రామయ్య అధికార వైసీపీ కార్పొరేటర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కార్పొరేటర్ క్రాంతికుమార్ మాట్లాడుతూ తన డివిజన్‌లో అభివృద్ధి జరగట్లేదని.. మేయర్ డివిజన్‌లో మాత్రం రూ.7కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నారని తెలిపారు. మాకు అరకొరగా నిధులిస్తున్నారని.. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు ఇదేనా మీరిచ్చే గౌరవం అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మేయర్ ఇష్టానుసారంగా మాట్లాడితే సస్పెండ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఓవరాక్షన్ చేయకు.. అతణ్ని లాగి పడేయండి.. ఈడ్చేయండి అని పోలీసులకు ఆదేశాలిచ్చారు. దీంతో బయటకు తీసుకెళ్లేందుకు పోలీసులు రాగా తానేం తప్పు చేశానో చెప్పాలని కార్పొరేటర్ డిమాండ్ చేశారు. అయితే సహచర కార్పొరేటర్లు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. మేయర్ వ్యాఖ్యలపై కొంతమంది కార్పొరేటర్లు అసహనం వ్యక్తం చేశారు.