కాంగ్రెస్ ప్రభుత్వంపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR మరోసారి విమర్శలు గుప్పించారు. కొనుగోలు కేంద్రాలు లేక 20 రోజులగా కల్లాల వద్ద రైతులు బాధపడుతున్నారని అన్నారు. హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో పేదలపై సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతాపం చూపిస్తున్నదని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. తడిగుడ్డతో గొంతు కోయడం అంటే ఏంటో అనుకున్నాం కొనుగోళ్లు లేక తడుస్తున్న ఈ ధాన్యం చూస్తుంటే తెలుస్తుందని కేటీఆర్ అన్నారు. కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడడం అంటే ఏంటో అనుకున్నాం కల్లాల వద్ద 20 రోజులుగా రైతన్నలు పడుతున్న బాధలు చూస్తే తెలుస్తుందని తెలిపారు.
రుణమాఫీ, రైతుభరోసా, ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి కింద రూ.లక్ష 116, తులం బంగారం అడిగితే కాంగ్రెస్ నేతలు సాకులు చెబుతున్నారని విమర్శించారు. నాడు నిరుద్యోగుల కాళ్లు పట్టుకుని, నేడు వారి మీద నిర్దాక్షిణ్యంగా లాఠీఛార్జ్ చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తే అర్థం అవుతుంది అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.