స్వతంత్ర వెబ్ డెస్క్: తమిళ సూపర్ స్టార్, ఎంఎన్ఎం వ్యవస్థాపక అధ్యక్షుడు కమల్ హాసన్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో కోయంబత్తూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. తమిళనాడులోని డీఎంకే పార్టీతో కమల్ పార్టీలో పెత్తు పెట్టుకుంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ స్థానం నుంచి పోటీ చేసిన కమల్ కేవలం 1,728 స్వల్ప ఓట్ల తేడాతో భాజపా అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు. సెంటిమింట్ కలిసి వచ్చే అవకాశం ఉండటంతో ఆ స్థానం నుంచి పోటీ చేయించడానికి డీఎంకే ఆలోచిస్తున్నట్టు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన ఏ పార్టీ చేయలేదు. కోయంబత్తూరు జిల్లాకి చెందిన పార్టీ నేతలు కూడా కమల్ హాసన్‌ని ఈ విషయంపై అడిగారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం అవ్వడానికి ఆదివారం కమల్ హాసన్ మక్కలోడు మైమ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు.
ఈ కార్యక్రమం ద్వారా క్షేత్ర స్థాయిలోని పార్టీ కార్యకర్తలు, నేతలు వీధి, వీధినా తిరుగుతూ స్థానిక సమస్యలను తెలుసుకోనున్నారు. అలాగే ఇతర పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల దృష్టికి రాని సమస్యలపై దృష్టి పెడుతూ ప్రజల నుంచి స్పందన కోరనున్నారు. క్షేత్రస్థాయిలో తిరిగే కార్యకర్తలకు 25 ప్రశ్నలతో కూడిన గూగుల్ ఫాం(Google Form)లు అందించి, వాటి ద్వారా ఎప్పటికప్పుడు వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి, నియోజకవర్గాల వారీగా ఆ అంశాలపై గళమెత్తనున్నారు. ప్రజల నుంచి వచ్చే స్పందనను అనుసరించే వచ్చే ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టోను తయారు చేయనున్నట్లు సీనియర్ నేతలు వెల్లడిస్తున్నారు.
డీఎంకే నాయకురాలు కనిమొళి నడుపుతున్న బస్సు ఎక్కిన వివాదంతో ఉద్యోగానికి రాజీనామా చేసిన తమిళనాడు బస్సు డ్రైవర్ షర్మిలకు కమల్ హాసన్ ఇటీవల కారును బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. కమల్ హాసన్ ఆమెను తన చెన్నై ఇంటికి ఆహ్వానించి, ఆమె జీవనోపాధి కోసం నడపడానికి కొత్త కారును ఆమెకు అందజేశారు. కోయంబత్తూరుకు చెందిన షర్మిలకు కమల్ కారును బహుమతిగా ఇవ్వడం కూడా ఆ ప్రాంతంలో పాపులారిటీ సంపాదించుకోవడానికి తమిళ సూపర్ స్టార్ వేసిన ఎత్తుగడగా భావిస్తున్నారు.