పైన పటారం… లోన లొటారం అన్నట్టు ఉంది ఖమ్మంలో కాంగ్రెస్ పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో ఐక్యతను చాటుకుని విజయాన్ని అందించిన ఆ పార్టీలో.. ప్రస్తుతం ఎంపీ టికెట్ వ్యవహారంతో మంత్రుల మధ్య నిశ్శబ్ధ యుద్ధం సాగుతోంది. ఇంతకీ ఎందుకా సెలైంట్ వార్..? ఎవరా మంత్రులు..? ఎందుకా లొల్లి..?
కాంగ్రెస్ నాయకులకు వర్గపోరు కొత్తేమీ కాదు. బాహటంగానే ఒకరిపై ఒకరు విరుచుకుపడి ఒకప్పుడు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసిన చరిత్ర హస్తం నేతలది. వర్గ విబేధాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఆ పార్టీ.. అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్నడులేని విధంగా ఐక్యతను కనబరిచారు. అంతా ఏకతాటిపైకి రావడంతో ఆపూర్వ విజయం వారి సొంతమైంది. ఆ విజయం వల్లే తొలిసారిగా ఖమ్మం జిల్లాలో ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయి. అయితే,.. ఇక్కడ వరకూ బాగానే ఉన్నా.. ఇప్పుడు ఎంపీ టికెట్ పంచాయితీతో ఖమ్మం జిల్లా మంత్రుల మధ్య వర్గపోరు మొదలైనట్టు తెలుస్తోంది. ఈ పోరు పార్లమెంట్ ఎన్నికల వేళ ఖమ్మంలో గెలుపోటములపై ఎఫెక్ట్ పడే అవకాశముందన్నటాక్ నడుస్తోంది.
ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక రాష్ట్ర స్థాయి దాటి జాతీయ స్ధాయిలోను చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌కు విజయం పక్కా అనుకుంటున్న నియోజకవర్గాల్లో ఖమ్మం ముందు స్ధానంలో ఉంది. అందుకే ఖమ్మం పార్లమెంటుకు పోటీ చేయాలనుకునే ఆశావాహులు సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక్కడి నుంచి టికెట్ తెచ్చుకుంటే చాలు గెలుపు ఖాయమన్న ధీమాలో ఉన్నారు. ఈ నేఫథ్యంలోనే జిల్లాకు చెందిన మంత్రులు మల్లు భట్టివిక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కుటుంబ సభ్యులతో పాటు మరికొందరు టికెట్ ఆశిస్తున్నారు. తుమ్మల తనయుడు యుగంధర్ అవకాశం ఇస్తే పోటీ చేస్తాం.. లేదంటే వదిలేస్తామన్న ధోరణిలో ఉండగా.. భట్టి విక్రమార్క, పొంగులేటి మాత్రం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. భట్టి సతీమణి నందిని తనకు అవకాశం కల్పించాలని గట్టిగా పట్టుబడుతోంది. అలాగే సోదరుడు ప్రసాద్‌రెడ్డి కోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అదే పట్టులో ఉన్నారు. దీంతో పొంగులేటి, భట్టిల మధ్య వర్గపోరు పురుడుపోసుకుందన్న టాక్ వినిపిస్తోంది. తమ కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వాల్సిందేనని హైకమాండ్‌పై ఒత్తిడి తేవడమే కాదు.. తమకు తోచిన దారిలో టికెట్ సంపాదించే ప్రయ త్నాల్లో ఉన్నారు భట్టి, పొంగులేటి. ఇద్దరూ ఎవరికి వారు తగ్గేదేలే అని పట్టుబట్టడంతో అటు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ,..ఇటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటి ఎన్ని సార్లు సమావేశమైనా అభ్యర్ధి ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం రాలేదు. ఇద్దరు మంత్రులలో ఏ ఒక్కరు వదులుకునేందుకు సిద్దంగా లేకపోవడంతో అభ్యర్ధి ఎంపిక నిర్ణయాన్ని చివరకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేకు వదిలేసినట్టు సమాచారం.
టికెట్ పంచాయితీ వర్గపోరుకు దారి తీస్తోంది. సామాజిక మాధ్యమాల్లో మంత్రుల అనుచరులు ఒకరికి అనుకూలంగా,.. మరొకరికి వ్యతిరేకంగా పోస్ట్‌లు పెట్టడం స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గడిచిన నాలుగు నెలలుగా ముగ్గురు మంత్రుల వ్యవహార శైలిలో ఎలాంటి భిన్నాభిప్రాయాలకు తావులేక పోగా.. టికెట్ లొల్లితో ఇద్దరు మంత్రుల మధ్య జరుగుతున్న నిశ్శబ్ద యుద్దం జిల్లాలో కాంగ్రెస్‌పై ఖచ్చితం గా ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నాయి రాజకీయ వర్గాలు. మరి మంత్రులు ఆశిస్తు న్నట్టు వారి కుటుంబ సభ్యల్లో ఎవరికి టికెట్ దక్కనుంది..? ఖమ్మం పార్లమెంట్ బరిలో నిలిచేదెవరు..? టికెట్ పంచాయితీ ఎక్కడకు దారి తీస్తుందోనన్న ఆసక్తి నెలకొంది.