బీఆర్ఎస్ సభ తర్వాత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన భవిష్యత్ కార్యాచరణపై కొంత డైలమాలో పడినట్లు సమాచారం. ఇటీవల హోం మంత్రి అమిత్ షా తో భేటీ అవుతారని ప్రచారం జరిగినా, అది వాయిదా పడింది. అయితే కాంగ్రెస్ లోకి రావాలని పొంగులేటిపై నాలుగు వైపుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది. ఈయనకేమో బీజేపీవైపు వెళ్లాలని ఉంది. అక్కడ ప్రాణ స్నేహితుడు ఈటెల రాజేందర్ ఉండటం కూడా మరో కారణంగా చెబుతున్నారు. అందుకే చెట్టు, ఫలాలు అంటూ పిట్టకథలు చెబుతున్నారని కొందరు వ్యాక్యానిస్తున్నారు.
ఈ క్రమంలో ఖమ్మం సభ దిగ్విజయం చేయడంతో పాటు జిల్లా రాజకీయాలపై మంత్రి హరీశ్ రావును ఫోకస్ చేయమని అధినేత కేసీఆర్ నుంచి సంకేతాలు అందినట్లు గులాబీ నేతలు చెబుతున్నారు. పొంగులేటి దారిలోకి రాకపోతే, ఆయన అనుచరులను బీఆర్ఎస్ లో చేర్పించేలా అప్పుడే పావులు కదుపుతున్నట్టు భోగట్టా. వాళ్లు అటు జారిపోకుండానే ఏదొక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు అటు జాతీయ స్థాయిలో ముగ్గురు సీఎంలను తీసుకువచ్చి బీఆర్ఎస్ పార్టీకి ఒక గ్లామర్ తెచ్చారు. అలాగే ఇటు ఖమ్మంలో తమ పట్టు బిగించుకునే పనిలో పడ్డారు. ఈ సభ తర్వాత పొంగులేటి కొంత ఆత్మరక్షణలో పడినట్లు సమాచారం. ఏ పార్టీలో చేరితే మంచిదని అప్పుడే రెండు, మూడు సర్వేలు చేయించినట్లు సన్నిహుతులు చెబుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ. బీఆర్ఎస్ పార్టీల వారీగా, నియోజకవర్గాల్లో అభ్యర్ధుల మీద కూడా సర్వే చేయించినట్లు తెలిసింది. ఆ రిజల్ట్ వచ్చాకే అమిత్ షాతో భేటీ అయ్యేదీ లేనిదీ తెలుస్తుందని అంటున్నారు.
మరో వైపు కాంగ్రెస్ లో చేరాలని అధినాయకత్వం నుంచి పొంగులేటిపై తీవ్రంగా ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం. బీజేపీ కన్నా కాంగ్రెస్ లో గెలవడం సులువని, అక్కడ ఓటు బ్యాంక్ కలిసి వస్తుందని అనుచరులు నొక్కి చెబుతున్నారని అంటున్నారు. ఒకవేళ మాట వినకపోతే, వాళ్లు బీఆర్ఎస్ లో ఉండిపోవడమో, లేదా కాంగ్రెస్ గూటికి చేరిపోవడమో చేస్తారని అంటున్నారు. అనుచరులను వదులుకోవడం పొంగులేటికి ఇష్టం లేదు. ఇప్పటికే టీ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే భట్టి విక్రమార్క బహిరంగంగానే ఆహ్వానం పలికారు.
ఇప్పటి వరకు పార్టీ మారే విషయంలో పొంగులేటి ఎలాంటి సంకేతం ఇవ్వకపోవడంతో ఆయన వర్గీయుల్లో నిస్తేజం కనబడుతోంది. ఇలాగే కాలయాపన చేస్తే ట్రబుల్ షూటర్ హరీశ్ రావు ఆపరేషన్ తో చాలా మంది తిరిగి కారెక్కడం ఖాయమని చెబుతున్నారు. కాంగ్రెస్ లో చేరితే తమకు బెర్తు ఉండదని కొందరు, బీజేపీలోకి వస్తే బెర్తు దొరకదని మరి కొందరు స్వంత సమీకరణాల్లో ఉన్నట్లు చెబుతున్నారు.
ఖమ్మం జిల్లాలో పొంగులేటిని బలహీన పర్చే వ్యూహంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారని పొంగులేటి వర్గీయులు, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం వేదిక మీద నుంచి సీఎం కేసీఆర్… జిల్లా మంత్రి పువ్వాడ ఉన్నప్పటికీ, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుతో సంప్రదించి పనులు చేయించుకోవాలని సూచించడం ఇందుకు నిదర్శనమని అంటున్నారు. రానున్న రోజుల్లో ఖమ్మం జిల్లా రాజకీయాలను చక్కదిద్దేందుకు ట్రబుల్ షూటర్ హరీశ్ రావును ప్రయోగిస్తారేమో అని పొంగులేటి వర్గీయుల్లో చర్చ మొదలయింది. త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే తనతో ఉన్న వారిని కాపాడుకోవడం సులువవుతుందని విశ్లేషిస్తున్నారు. ఆలస్యం చేసిన కొద్ది పొంగులేటికి ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.