ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సీఆర్డీఏ పరిధిలో రూ.2,700 కోట్ల మేర పనులు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. భవనాలు, లే అవుట్‌ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. తిరుపతిలోని ఈఎస్‌ఐ ఆస్పత్రిని 50 పడకల నుండి 100 పడకలకు పెంచుతూ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
మొత్తం 14 అంశాలే ఎజెండాగా కేబినెట్‌లో చర్చ జరుగుతోంది. మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ శాఖల అంశాలే ప్రధాన ఏజెండాగా మంత్రి వర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో 11 గంటల నుంచి ఈ సమావేశం కొనసాగుతోంది. ఇంకా ఏపీ ఎం ఆర్ యూ డి ఏ చట్టం 2016లో భవనాల లే అవుట్‌ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ సవరణ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. పిఠాపురం ఏరియా డెవలెప్మెంట్ అథారిటీలో 19 నూతన పోస్టులకు అనుమతి మంజూరు చేస్తూ మంత్రి మండలి ఆమోదించే అవకాశం ఉంది. గుంటూరుజిల్లా పత్తిపాడు మండలం నదింపాలెం గ్రామంలో ఆరున్నర ఎకరాల స్థలాన్ని 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.
SIPB ఆమోదించిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది. ఈ పెట్టుబడుల వలన 2,63,411 మందికి ఉద్యోగాలు వస్తాయని సమాచారం. నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో 6 వేల ఎకరాల్లో రూ. 96,862 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటుకు కూడా మంత్రి మండలి ఆమోదించబోతుంది. విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్‌లో 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీసీఎస్ పెట్టుబడులకు కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉంది. శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ సంస్ధ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్‌ల కోసం ఈ సంస్థ రూ. 1,046 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది.
అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని 106 ఎకరాల్లో బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.1,174 కోట్ల పెట్టుబడులకు, రాష్ట్రంలో కొత్తగా ఐదు సంస్థలు క్లీన్ ఎనర్జీలో రూ. 83 వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదించబోతుంది.
వీటితోపాటు ఎజెండా పూర్తయ్యాక సీఎం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పేర్కొన్న రాష్ట్రంలోని నదుల అనుసంధానం గోదావరి టు బనకచర్ల ఇంట్రాకనెక్ట్ ఆఫ్ రివర్స్ పైన క్యాబినెట్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. గడిచిన ఆరు నెలల పాలన, రానున్న ఏడాది పాలనలో తీసుకురావాల్సిన మార్పులు చేర్పులపై మంత్రులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే మంత్రులందరి నుంచి పర్ఫామెన్స్ రిపోర్టులను తీసుకున్న సీఎం… వీటి పైన, తన వద్ద ఉన్న రిపోర్టుల వివరాలతో కలిపి క్యాబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.