మనదేశంలో ముఖ్యమంత్రులు జైలు కెళ్లడం కొత్తేమీ కాదు. కుంభకోణాల్లో పేర్లు రావడంతో గతంలో పలు వురు ముఖ్యమంత్రులు జైళ్లకు వెళ్లారు.ఇటీవల మైనింగ్ కుంభకోణం వెలుగు చూడడంతో ఝార్కండ్ ముఖ్య మంత్రిగా ఉన్న హేమంత్ సోరేన్‌ను ఎన్‌ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అరెస్టు చేసింది. తరువాత సోరేన్‌ను జైలుకు పంపారు. దీంతో ముఖ్యమంత్రి పదవికి హేమంత్ సోరేన్ రాజీనామా చేశారు. అయితే జైలుకెళ్లి కూడా పరిపాలన సాగిస్తున్న తొలి ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ అరుదైన ఘనత సాధించారు. జైలు నుంచే ముఖ్యమంత్రి హోదాలో కేజ్రీవాల్ ఢిల్లీ పాలనా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఆధునిక భారతదేశ చరిత్రలో ఇదొక అరుదైన సంఘటన. లిక్కర్ కుంభకోణం నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఇటీవల ఈడీ ఉన్నతాధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
వాస్తవానికి కేజ్రీవాల్ మొదట్నుంచీ రాజకీయవేత్త కాదు. బ్యూరోక్రాట్‌గా జీవితం ప్రారంభించిన కేజ్రీవాల్ ఆ తరువాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 1968లో హర్యానాలోని ఒక మధ్య తరగతి కుటుంబంలో కేజ్రీవాల్ జన్మించారు. ఖరగ్‌పూర్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నారు. ఆ తరువాత ఇండియన్ రెవిన్యూ సర్వీస్‌కు ఎంపికయ్యారు. ఐఆర్‌ఎస్ అధికారిగా కేజ్రీవాల్ చాలా కాలం పాటు పనిచేశారు. సమాచార హక్కు చట్టం కావడంలో కేజ్రీవాల్‌ది కీలక పాత్ర. సమాచార హక్కు చట్టం ద్వారా ఢిల్లీలోని వివిధ ప్రభుత్వ సంస్థల్లో అవినీతి వ్యవహారాలను బట్టబయలు చేశారు కేజ్రీవాల్. అలాగే 2008లో నకిలీ రేషన్ కార్డులు వెలికి తీయడం లో కూడా ఆయన కృషి చేశారు. వాస్తవానికి నకిలీ రేషన్ కార్డులు ఒక పెద్ద కుంభకోణం. కేజ్రీవాల్ కృషి ఫలితం గా దొంగ రేషన్ కార్డులు రద్దయ్యాయి. వాటి స్థానంలో అర్హులైన పేదలకు కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చింది అప్పటి ఢిల్లీ ప్రభుత్వం. ఐఆర్‌ఎస్ అధికారిగా ఉండగా 1999 డిసెంబర్‌లో పరివర్తన్ అనే సామాజిక సంస్థను కేజ్రీవాల్ ఏర్పాటు చేశారు. పరివర్తన్ సంస్థ సాయంతో ఢిల్లీ ప్రజలకు అనేక దైనందిన అంశాల పట్ల అవగాహన కల్పించారు. ఇందులో పన్నులు, విద్యుత్, ఆహార పంపిణీ తదితర అంశాలు ప్రధానంగా ఉన్నాయి. దీంతో ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ బాగా దగ్గరయ్యారు.
ఐఆర్‌ఎస్ అధికారిగా పనిచేస్తున్న కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా అన్నా హజారే ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. అన్నా హజారే అవినీతి వ్యతిరేకోద్యమంలో తాను కూడా భాగస్వామి అయ్యారు. జన లోక్‌పాల్ బిల్లు కోసం అన్నా హజారే నాయకత్వంలో జరిగిన ఆందోళనా కార్యక్రమాల్లో ముందు వరుసలో నిలబడ్డారు. అన్నా హజారే అడుగులో అడుగేసి నడిచారు అరవింద్ కేజ్రీవాల్. అరవింద్ కేజ్రీవాల్‌పై అన్నా హజారే ప్రభావం ఎక్కువ. అన్నా హజారే ప్రభావంతో ప్రజలకు అవినీతి రహిత పాలన అందించాలని కేజ్రీ వాల్ భావించారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఐఆర్‌ఎస్ ఉద్యోగానికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. అయితే ఎంతో భవిష్య త్తు ఉన్న ఐఆర్ఎస్ కెరీర్‌ను వదులుకోవడం మంచిది కాదని ఈ సందర్బంగా మిత్రులు అనేకమంది కేజ్రీవాల్ కు సలహా ఇచ్చారు.
ఆలిండియా సర్వీసులో పనిచేస్తూనే ప్రజలకు సేవ చేయవచ్చు కదా అని మిత్రులు సూచించారు. అయితే ఈ సలహాలు, సూచనలను పట్టించుకోలేదు కేజ్రీవాల్. భవిష్యత్ లో వచ్చే కష్టాలను తట్టుకుంటామన్న ఆత్మ విశ్వాసం వ్యక్తం చేశారు. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక, వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు.అంతిమంగా ఐఆర్ఎస్ కొలువుకు గుడ్ బై కొట్టారు. ఆ తరువాత భావసారూప్యంగల అనేక మంది మిత్రులతో చర్చలు జరిపారు. శ్రేయోభిలాషులందరితో సంప్రదింపులు జరిపారు. ఈ నేపథ్యంలో ఓ ఫైన్ మార్నింగ్ 2012 లో ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేశారు కేజ్రీవాల్. అవినీతితో యుద్దం చేయడానికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు కేజ్రీవాల్. అయితే కేజ్రీవాల్ పార్టీ పెట్టినప్పుడు చాలా మంది పెదవి విరిచారు. మనదేశంలో రాజకీయాలంటే కుట్రలు, కుతంత్రాలకు నెలవు అనే అభిప్రాయం సామాన్య ప్రజల్లో బలంగా ఉంది. దీంతో బ్యూరోక్రాట్‌గా మంచి పేరు తెచ్చుకున్న కేజ్రీవాల్, కుట్రలు, కుతంత్రాలకు కేరాఫ్ అడ్రసుగా మారిన రాజకీయాల్లో నెగ్గుకు రాగలరా అనే సందేహం చాలా మందికి కలిగింది. అయితే వీటిని కేజ్రీవాల్ పట్టించుకోలేదు. తాను అనుకున్నది సాధించా లన్న ఏకైక లక్ష్యంతో ముందుకు సాగారు. అయితే ఎవరూ ఊహించ నివిధంగా రాజకీయాల్లో కేజ్రీవాల్ సక్సెస్ అయ్యారు. సక్సెస్ అంటే అలాంటి ఇలాంటి సక్సెస్ కాదు. ప్రధాని నరేంద్ర మోడీ ఛరిష్మాను తట్టుకుని ఢిల్లీలో నిలబడ్డారు. దేశ రాజధానీ నగరంలో పాగా వేశారు. అటు ప్రధాని నరేంద్ర మోడీ జనాకర్షణను ఇటు కేంద్రమంత్రి అమిత్ షా వ్యూహాలను తట్టుకుంటూ ఢిల్లీ రాజకీయాల్లో ముందుకు సాగారు కేజ్రీవాల్. ముచ్చటగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు.
ముఖ్యమంత్రిగా బస్తీల్లో నివసించే సామాన్య జనానికి దగ్గరయ్యారు కేజ్రీవాల్. పరిపాలనపై తనదైన ముద్ర వేశారు. కేంద్రం చెప్పుచేతల్లో నడిచే లెఫ్టినెంట్ గవర్నర్ లు కయ్యానికి కాలు దువ్వినా అన్నీ భరించి అందరికీ ఆమోద యోగ్యుడైన నాయకుడిగా ఎదిగారు. అయితే ఆప్ ను ఢిల్లీ పొలిమేరలకే పరిమితం చేయదలచుకో లేదు కేజ్రీవాల్. జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలనుకున్నారు. దీంతో ఆ దిశగా అడుగులు వేయడం మొద లెట్టారు.


