స్వతంత్ర వెబ్ డెస్క్: హరితహారం తొమ్మిదో విడత కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నేడు హరితోత్సవం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు అర్బన్ ఫారెస్ట్ పార్కులో మొక్కను నాటి తొమ్మిదో విడత హరితహారానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, రాచకొండ సీపీ చౌహాన్, ప్రభుత్వ ఉన్నత అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు సఫారీ వాహనంలో పార్కులో కలియతిరిగిన సీఎం కేసీఆర్.. ఫొటో ఎగ్జిబిషన్‌ను, అటవీ అధికారుల సామాగ్రిని తిలకించారు.
ఇక హరితహారం కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ ట్వీట్ చేసారు.. దశాబ్దాల పాటు ధ్వంసమైన పర్యావరణానికి వరం.. మహోద్యమంలో సాగుతున్న తెలంగాణ హరితహారం అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం అంటే.. ప్రజల బతుకుచిత్రాన్ని మార్చడమే కాదు.. ధ్వంసమైన అడవులను పునరుద్ధరించడం.. సకల జీవరాశులను సంరక్షించడం అని యావత్ దేశానికి సగర్వంగా చాటిచెప్పిన దార్శనిక ముఖ్యమంత్రి కేసీఆర్‌ది అని పేర్కొన్నారు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను తలదన్నేలా.. ఈ గ్రీన్ వాల్ ఆఫ్ తెలంగాణ నిర్మాణంలో.. భాగస్వాములైన ప్రకృతి ప్రేమికులందరికీ హృదయపూర్వక దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు అని పేర్కొంటూ కేటీఆర్ తన ట్వీట్ ముగించారు.