స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ముఖ్యంగా హైదరాబాద్ ప్రజా రవాణా అభివృద్ధి విషయంలో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. హైదరాబాద్ మహానగరంలో మెట్రో సేవలను మరింత విస్తృతం చేసేందుకు నిర్ణయించారు. దాదాపు రూ.60 వేల కోట్లతో మెట్రో విస్తరణ పనులు చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. వచ్చే మూడు నాలుగేళ్ల సమయంలో ఈ మొత్తం పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్లు కేటీఆర్ తెలిపారు.
సమగ్ర నివేదికతో రావాల్సిందిగా హైదరాబాద్ మెట్రో, పురపాలక శాఖలను ఆదేశించారు. ఇప్పుడు ఉన్న 70 కిలోమీటర్ల మెట్రో లైన్, కొత్తగా రాబోతున్న 31 కిలోమీటర్ల ఎక్స్ ప్రెస్ మెట్రో లైన్లకు అదనంగా మెట్రో సేవలను మరింత విస్తరించనున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. కొన్ని మెట్రో లైన్ వివరాలను మంత్రి కేటీఆర్ తెలియజేశారు. “పెరుగుతున్న నగరానికి మంచి మౌలిక వసతులు కచ్చితంగా కావాలి. అందులో భాగంగా ప్రజా రవాణాను విస్తృతం చేసేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. ఈ నగరం ఎంత పెరిగినా.. ఎన్ని లక్షల మంది వచ్చినా తట్టుకునే విధంగా ఉండేందుకు కొత్త ప్రణాళికలను రూపొందిస్తున్నాం. అందులో భాగంగా హైదరాబాద్ మెట్రో రైలుని విస్తృతం చేస్తూ వచ్చే 3, 4 సంవత్సరాల్లో పూర్తి చేసేలా నిర్ణయం తీసుకున్నాం.
ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయం వరకు 31 కిలోమీటర్ల మేర మెట్రో లైన్ కు సీఎం శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు జూబ్లీ బస్టాండ్ నుంచి తూంకుంట వరకు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ రాబోతోంది. ఒక లైన్లో మెట్రో, ఒక లెవల్లో వాహనాలు వెళ్తాయి. ప్యాట్నీ నుంచి ఓఆర్ఆర్ వరకు మరో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ వస్తుంది. వీటి నిర్మాణానికి కొన్ని డిఫెన్స్ ల్యాండ్స్ తీసుకోవాల్సి ఉంది. ఆ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఓల్డ్ సిటీ మెట్రోని కూడా పూర్తి చేస్తాం. ఇంకా ఏవైనా రూట్లను కలపాల్సి ఉన్నా.. రూట్లను పెంచాల్సి ఉన్నా అందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ మెట్రో విస్తరణకు సంబంధించి కేంద్రం కూడా సహకరిస్తుందని ఆశిస్తున్నాం. ఒకవేళ కేంద్రం సహాయం చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా నిర్మించేందుకు సిద్ధంగా ఉంది” అంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.