స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: తెలంగాణలోని ప్రతి గర్భిణీ ఆరోగ్యంగా ఉండాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన మరో పథకం ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’. గర్భిణులు రక్తహీనతతో బాధపడకూడదని.. గర్భిణులకు పౌష్టికాహారం ఇవ్వాలన్న సంకల్పంతో ఈ కిట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రొటీన్స్ , విటమిన్లు, మినరల్స్, అధికంగా ఉండే పోషకాహారం ద్వారా రక్తహీనతను తగ్గించడం.. తద్వారా హిమోగ్లోబిన్ శాతం పెంచడం ఈ కిట్ల లక్ష్యం. పేద మహిళల గురించి ఆలోచించి సీఎం కేసీఆర్.. తల్లీ, బిడ్డ బాగుండాలని ఈ కిట్ ని తీసుకొచ్చారు. మొదటి కిట్‌ను 13-27 వారాల మధ్య జరిగే రెండో ఏఎన్సీ చెకప్ సమయంలోఇస్తారు. రెండో కిట్‌ను 28-34 వారాల మధ్య చేసే మూడో ఏఎన్సీ చెకప్ సమయంలో ఇస్తారు.
రాష్ట్ర మంతటా వరంగా మారనున్న న్యూట్రిషన్ కిట్‌ను ప్రతి ఒక్క గర్భిణీ సదావకాశంగా భవిస్తూ ఉపయోగించుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని సూచించింది. తాజాగా, నూతన సచివాలయంలో న్యూట్రిషన్ కిట్ ఫైల్ పై సీఎం కేసీఆర్ సంతకం చేసి తగిన ఆదేశాలు జారీ చేశారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 6.84 లక్షల మంది గర్భిణీలకు.. 13.08 లక్షల కిట్స్ పంపిణీ చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఒక్కో న్యూట్రిషన్ కిట్ విలువ రూ. 2000 ఉంటుంది. ఈ పథకానికి మొత్తం రూ. 277 కోట్లు ఖర్చు చేయనుంది కేసీఆర్ ప్రభుత్వం.
రాష్ట్రంలోని పలు ఏజెన్సీ ప్రాంతాల్లో మహిళలు తీవ్రమైన రక్తహీనతను ఎదుర్కొంటున్నారని గుర్తించిన కేసీఆర్ సర్కారు.. ఈ సమస్యను అధిగమించే ప్రయత్నం చేసింది. ఇందుకు గాను దేశంలో అత్యుత్తమ విధానాన్ని అనుసరిస్తున్న రాష్ట్రాల్లో అధ్యయనానికి మహిళా ఐఏఎస్ అధికారుల బృందాన్ని పంపించింది. సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్, స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్, విద్యాశాఖ కార్యదర్శి, పూర్వ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ సహా 8 మంది మహిళా ఐఏఎస్ అధికారులను తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో పర్యటనకు పంపించింది.ఈ బృందం పర్యటన అనంతరం చేసిన సిఫారసు మేరకు ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’ను రూపొందించారు.


