మరోసారి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. లిక్కర్ కేసులో సీబీఐ విచారణను వ్యతిరేకిస్తూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సీబీఐ దరఖాస్తు తమకు ఇవ్వలేదని తెలిపారు కవిత తరపు న్యాయవాది. ఈ పిటిషన్‌ను బుధవారం విచారించనుంది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు
ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి ప్రత్యేక కోర్టు నిన్న అనుమతిని చ్చింది. ఈ కేసులో కవిత నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని, ప్రశ్నించేం దుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కవిత తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో.. అక్కడే విచారిస్తామని కోర్టుకు విన్నవించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన కొందరు కవిత పేరును ప్రస్తావించారని, ఈ నేపథ్యంలో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సిన అవసరం ఉందని వివరించింది. సీబీఐ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక కోర్టు.. జైలులో కవితను విచారించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తీహార్ జైలు అధికారుల కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కవితను విచారించేందుకు ఒక రోజు ముందుగానే జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని సీబీఐకి ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. విచారణ సమయంలో మహిళా సిబ్బంది తప్పకుండా ఉండాలని.. విచారణకు సంబంధించిన అన్ని నిబంధనలను పాటించాలని సూచించింది. దీనిపై కవిత కోర్టులో పిటిషన్ వేశారు.