అధికారం కోల్పోయిన గులాబీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పలువురు కీలక నేతలు కారు దిగారు. కొందరు హస్తం గూటికి చేరితే మరికొందరు కమలం గూటికి చేరారు. ఇప్పుడు జాబితాలో మాజీ డిప్యూటీసీఎం, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కడియంను పార్టీలో చేర్చుకుని, వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. 2014లో వరంగల్ ఎంపీగా గెలిచిన శ్రీహరికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సత్సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను కాంగ్రెస్‌లోకి రప్పించేందుకు సీఎం రేవంత్‌కు అత్యంత సన్నిహితుడైన ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ నేత ప్రయత్ని స్తున్నట్టు సమాచారం.
వరంగల్ ఎంపీగా కడియం పోటీ చేస్తే, ఫలితాల అనంతరం ఆయనతో స్టేషన్‌ఘన్‌పూర్‌కు రాజీనామా చేయించి.. ఉప ఎన్నికల్లో ఆయన కుమార్తె కావ్యకు టికెట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్టు తెలి సింది. దీనిపై శ్రీహరితో నేరుగా చర్చలు జరపాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించినట్టు సమాచారం. కాంగ్రెస్ రెండో జాబితా ఇవాళో రేపో వెలువడే అవకాశం ఉండగా.. కడియం నుంచి అనుకూల స్పందన వస్తే వరంగల్ సీటు పెండింగ్ పెట్టాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే నిత్యం కాంగ్రెస్‌పై నిప్పులు చెరుగుతున్న కడియం శ్రీహరి పార్టీ మారుతారా? అనే చర్చ కూడా జరుగుతోంది