నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్‌కి చేరింది. కడెం ప్రాజెక్టు నీటి నిలువ తగ్గి కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు, 7.603 TMCలు కాగా, ప్రస్తుతం 675.625 అడుగులు, 2.870 TMCలకు చేరుకుంది.
కడెం ప్రాజెక్టులో పూడిక అతిగా ఉన్న నేపథ్యంలో నీటి నిలువ సామర్థ్యంలో సందేహాలు వ్యక్తమవు తున్నాయి. నిర్మల్, మంచిర్యాల జిల్లాలకు 68వేల ఎకరాలకు సాగు నీరందించే ఈ ప్రాజెక్టు రైతుల జీవితాల్లో కష్టాలు తెచ్చి పెట్టింది. ప్రాజెక్టు నీటి మట్టం డెడ్ స్టోరేజ్‌కి చేరుకుంది. వర్షా కాలంలో కడెం, దస్తురాబాద్, జన్నారం, దండేపల్లి, లక్షెటి పేట్, హాజీపూర్ మండలాల్లోని 68వేల ఎకరాలకు సాగునీరు అందించింది. నవంబర్, డిసెంబర్ నెలల్లో వర్షాలు కురవక పోవడంతో ప్రాజెక్టు కౌంటర్ వెయిట్ కొట్టుకుపోవడంతో నీరంతా వృధాగా పోయింది. దీంతో జిల్లాలోని రైతాంగానికి నీటి కటకట ఏర్పడింది. నీరంతా వృధాగా పోవడంతో యాసంగి పంటకు నీరు కరువైంది. ప్రాజెక్టులో నీరు అడుగంటడంతో పంటలు ఎండిపోతున్నాయి. గతడేది కంటే నీటి మట్టం భారీగా తగ్గిపోయింది. యాసంగిలో నీరు ఇవ్వమని గతంలోనే ఇరిగేషన్ అధికారులు చెప్పారు. ప్రాజెక్టు కిందనే ఉన్న గ్రామాలకు సాగునీరు వస్తుందని రైతులు పంటలు వేశారు. తీరా పంటలు చేతికి వచ్చే సమయానికి పంటకు నీరు అందకపోవ డంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న పంటకు నీరు అందించలేక, కళ్ళ ముందు పంట వదిలిపెట్టలేక ఉన్నామని వాపోతున్నారు.
గత రెండు సంవత్సరాల నుండి భారీ వర్షాల వల్ల పంట నష్టపోయామని రైతులు వారి బాధను వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రాజెక్టుకు మరమ్మత్తులు కాకపోవడం, డెడ్ స్టోరేజ్‌లో నీళ్లు ఉండడం వల్ల పంటకు నీరు అందక ఎండిపోతున్నాయన్నారు. దీంతో పంటను పశువులకు వదిలేయాల్సిన పరిస్థితి నెలకొంద న్నారు. మళ్లీ ఇలాంటి కష్టాలు రాకుండా ఇరిగేషన్ అధికారులు ఇప్పటికైనా మేలుకొని తగు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.మరోవైపు నిర్మల్ జిల్లాలోని పలు గ్రామాల రైతులు పంట లకు సాగునీరు విడుదల చేయాలని ఆందోళన బాటపట్టారు. కడెం మండలంలోని నచ్చన్, ఎల్లాపూర్ గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుండి సదర్మాట్ కాలువకు సాగునీరు నిలిపివేశారు అధికారులు. దీంతో పంట చేతికొచ్చే సమయంలో పొలాల్లో భూమి పగుళ్లు తేలి ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సదర్మాట్ నుండి సాగునీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎండనక వాననకా కష్టపడి వేసిన పంట తీర నోటికాడి కొచ్చే సమయంలో ఎండిపోతుండడంతో రైతు ఆవేదన అంతా ఇంతా కాదు. ప్రాజెక్టులు కట్టాం, నీళ్లు ఇచ్చాం అన్న ప్రభుత్వాల మాటలు నీటిమూటలుగానే మిగిలిపోతున్నాయి.


