స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ప్రజాస్వామ్యానికి గొంతుక అయినటువంటి జర్నలిజం వృత్తిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రత్యేక రాష్ట్రంలో కనీస గౌరవం లేదని మండిపడ్డారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వై ఎస్ షర్మిల. ఉద్యమంలో పోరాడిన జర్నలిస్టులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసే దౌర్భాగ్య స్థితికి కేసీఆర్ తీసుకొచ్చారని ట్విట్టర్ ద్వారా తమ ఆవేదనను వెల్లడించారు. ఏ జిల్లాకు వెళ్తే ఆ జిల్లాలో జర్నలిస్టులకు మోసపూరిత హామీలు ఇవ్వడం కేసీఆర్ కు అలవాటుగా మారిందని అన్నారు. హైదరాబాద్ జర్నలిస్టులు అసూయపడేలా వరంగల్ లో జర్నలిస్టు హౌసింగ్ కాలనీ నిర్మిస్తానన్నారు. దానికి ఇప్పటివరకు అతీగతీ లేదని ఫైర్ అయ్యారు.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చాక జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని వైయస్ఆర్ బిడ్డ మాటిస్తుందని తెలియజేశారు.
ఇందిరాపార్క్ వద్ద జర్నలిస్టులు చేపట్టిన పోరాటానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందని షర్మిల అన్నారు. జర్నలిస్టుల బతుకులను కేసీఆర్ బుగ్గిపాలు చేశారని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రంలోనూ ఇండ్ల జాగలు లేవు. హెల్త్ కార్డుల అమలు లేదు. నాడు వైయస్ఆర్ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం 70 ఎకరాలు కేటాయిస్తే.. కోర్టు తీర్పు వెలువరించి ఏడాది కావొస్తున్నా జర్నలిస్టులకు కేటాయించడం లేదు. బీఆర్ఎస్ పాలనలో జర్నలిస్టులకు గౌరవం కూడా లేదని వ్యాఖ్యానించారు.