స్వతంత్ర, వెబ్ డెస్క్: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద వార్త తెలిసి తన గుండె పగిలిందని తెలిపారు. తనతోపాటు ప్రథమ పౌరురాలైన జిల్ బైడెన్ కూడా తీవ్ర విషాదం వ్యక్తం చేశారని వ్యాఖ్యానించారు. ప్రమాదంలో ప్రియమైన కుటుంబసభ్యులను కోల్పోయిన వారితో పాటు క్షతగాత్రుల కోసం ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై అమెరికా ప్రజలందరూ తమ సంతాపం చెబుతున్నట్లు బైడెన్ ప్రకటించారు. మరోవైపు చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పాటు జపాన్, నేపాల్, పాకిస్థాన్, కెనడా, జర్మనీ తదితర దేశాల ప్రధానులు కూడా ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తమ సంతాపం తెలియజేస్తున్నారు. కాగా ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో 290 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా 1100 మంది దాకా గాయపడ్డారు.