రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న గుంటూరు ఎంపీ సీటు అభ్యర్థి విషయంలో జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. గుంటూరు ఎంపీ స్థానంలో వైసీపీ జండా ఎగర వేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా తాజాగా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు ఇంఛార్జి బాధ్యతలు అప్పగించారు.
వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంటు స్థానాలు గెలవడమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి 151 అసెంబ్లీ స్థానాలను, 22 పార్లమెంటు స్థానాలను గెలు చుకుంది. గత ఎన్నికల్లో వైసిపి 22 ఎంపీ సీట్లు గెలుచుకున్నా విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం ఎంపీ స్థానాలు మాత్రం గెలుచుకోలేకపోయింది. రానున్న ఎన్నికల్లో ఈ మూడు స్థానాల్లో కూడా విజయం సాధించడం కోసం అభ్యర్థుల ఎంపికపై జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఇప్పటికే శ్రీకాకుళం, విజయవాడ ఎంపి అభ్యర్థులను ఖరారు చేశారు. గత ఎన్నికల్లో టీడీపీ తరుపున విజయం సాధించిన కేశినేని నాని ఇటీవల వైసీపీ లో చేరారు. దీంతో ఆయనకు విజయవాడ ఎంపి సీటు ఖరారు చేశారు. అయితే గుంటూరు ఎంపి అభ్యర్థి విషయంలో పక్కాగా విజయం సాధించే అభ్యర్థికోసం సీఎం జగన్ గాలిస్తున్నారు. తాజాగా వైసీపీ అభ్యర్థుల ఎనిమిదో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో గుంటూరు పార్లమెంట్ ఇంఛార్జి బాధ్యతలు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు అప్పగించింది.
గుంటూరు పార్లమెంటు సీటుకు బలమైన వెదుకుతున్నారు సీఎం జగన్ . గత ఎన్నికల్లో గుంటూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా మోదుగుల వేణుగోపాలరెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వేణు గోపాల్ రెడ్డి ఓడిపోయారు. టిడిపి నుంచి పోటీ చేసిన గల్లా జయదేవ్ విజయం సాధించారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం వేణుగోపాల్ రెడ్డి సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత జగన్ కూడా ఎవరికీ ఇంఛార్జి బాధ్యతలు ఇవ్వలేదు. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో యువకుడు, ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడును వైసీపీ తెరపైకి తీసుకు వచ్చింది. అంబటి రాయుడు గుంటూరు ఎంపిగా పోటీ చేస్తారంటూ ప్రచారం చేసింది. అంబటి రాయుడు కూడా అధికారికంగా వైసీపీ కండువా కప్పుకున్నా రు. అయితే ఆ తర్వాత గుంటూరు ఎంపిగా పోటీ చేయాలంటూ నరసరావు పేట ఎంపిగా వున్న లావు శ్రీ కృష్ణ దేవరాయ లు కు సీఎం జగన్ సూచించారు. దీంతో మనస్థాపం చెందిన అంబటి రాయుడు వైసీపీ కి గుడ్ బై చెప్పారు.
మరోవైపు ఎంపీ కృష్ణ దేవరాయలు సైతం గుంటూరు ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపలేదు. నరసరావు పేట నుంచి ఎంపిగా పోటీ చేస్తా అంటూ సీఎం దృష్టి కి తీసుకెళ్లారు. అందుకు సీఎం జగన్ ఒప్పుకోలేదు. దీంతో కృష్ణ దేవ రాయలు వైసీపీ కి రాజీనామా చేశారు. రాయుడు రాజీనామా, కృష్ణ దేవరా యలు పోటీకి వెనుకంజ వేయడంతో పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తనయుడు రమణను గుంటూరు పార్లమెంట్ ఇంఛార్జి గా నియమించారు. ఇటీవలే ఇంఛార్జి బాధ్యతలు చేపట్టిన అయన ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతలోనే జగన్ రమణను అక్కడ నుంచి తప్పించి ఆయనకు బంధువు అయిన పొన్నూరు ఎమ్మెల్యే రోశయ్యకు పార్లమెంట్ ఇంఛార్జి బాధ్యతలు ఇచ్చారు. గుంటూరు ఎంపీగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పోటీ చేస్తారనే ప్రచారం కొద్దీ రోజులుగా జరుగుతుంది. తనకు మంగళగిరి సీటు ఇచ్చే అవకాశం లేకపోవడంతో ఆర్కే గతంలో వైసీపీ కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా మళ్లీ అయన వైసీపీ లో చేరారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యం లో చివరకు గుంటూరు ఎంపి అభ్యర్థి ఎవరు అవుతారో క్లారిటీ రావాలంటే.. కొంతకాలం ఆగాల్సిందే.