స్వతంత్ర వెబ్ డెస్క్: గాజాలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం(Israel-Hamas war) ఇప్పట్లో ముగియదని.. ఆ యుద్ధ జ్వాలల నుంచి అమెరికా తప్పించుకోలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్-అబ్దుల్లాహియాన్(Hossein Amir-Abdullahian) అన్నారు. ఐరాసలో జరిగిన జనరల్ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు.
ఇజ్రాయెల్-హమాస్(Israel-Hamas )మధ్య భీకర పోరు కొనసాగుతోన్న విషయం తెలిసిందే.ఈ యుద్ధంలో ఇజ్రాయెల్(Israel)కు అండగా నిలుస్తోన్న అమెరికా.. హమాస్ సంస్థకు ఇరాన్(Iran) మద్దతు ఇస్తుందని అమెరికా ఆరోపించింది. దీంతో అగ్రరాజ్యంపై ఇరాన్ మండిపడుతోంది. తాజాగా ఐక్యరాజ్య సమితి(United Nations) వేదికగా ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి హోస్సేన్ అమిరబ్దుల్లా అమెరికా(America)ను హెచ్చరించారు. గాజాలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఇప్పట్లో ముగియదని, ఆ యుద్ధజ్వాలల నుంచి అమెరికా తప్పించుకోలేదని అన్నారు.
ఐరాసలోని 193 సభ్య దేశాలున్న జనరల్ అసెంబ్లీ(General Assembly)లో మిడిల్‌ఈస్ట్ ప్రస్తుత పరిస్థితులపై హోస్సేన్ మాట్లాడారు. ‘పాలస్తీనాలో మారణహోమాన్ని వెనుకుండి నడిపిస్తోన్న అమెరికా ప్రతినిధులకు సూటిగా చెబుతున్నా. ఈ యుద్ధం ప్రాంతీయంగా విస్తరించడాన్ని మేం ఏ మాత్రం అంగీకరించం. గాజా(Gaza)లో ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే మాత్రం.. ఆ యుద్ధ జ్వాలల నుంచి అమెరికా తప్పించుకోలేదు. యుద్ధంలో బాధితులకు మానవతా సాయం చేసేందుకు ఖతర్(Qatar), తుర్కియో(Turkey)తో పాటు మా దేశం కూడా ముఖ్య భూమిక పోషించేందుకు సిద్ధమే. అయితే, 6 వేల మంది పాలస్తీనా(Palestine) ఖైదీలను విడుదల చేయడం కూడా ఎంతో ముఖ్యమైన అంశం. బందీలుగా ఉన్న పౌరుల్ని విడుదల చేసేందుకు హమాస్(Hamas) సిద్ధంగా ఉంది. ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 6 వేల మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసేందుకు ప్రపంచం ఇజ్రాయెల్‌ను ఒప్పించాలి’’అని అన్నారు.
ఇజ్రాయిల్-హమాస్ పోరులో అమెరికా ఇజ్రాయిల్ కి పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ యుద్ధంలో ఇరాన్(Iran) కానీ దాని ప్రాక్సీలు కానీ దాడులకు పాల్పడితే అమెరికా వేగంగా స్పందిస్తుందని అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్(Antony Blinken) వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ఇజ్రాయిల్ ఉత్తర భాగంలో దాడులు చేస్తున్న హిజ్బుల్లా మిలిటెంట్లకు ఇరాన్ సాయం ఉంది. మరో వైపు ఇజ్రాయిల్ కి సాయం కోసం రెండు విమాన వాహక నౌకల్ని మిడిల్ ఈస్ట్ కి పంపింది.
ఇదిలా ఉండగా, తూర్పు సిరియా(Eastern Syria)లో ఉన్న రెండు ఆయుధ కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులకు పాల్పడింది. ఆ కేంద్రాల వద్ద ఇరాన్ దళాలతో పాటు అనుబంధ గ్రూపులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఆ దేశ రక్షణశాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్(Minister Lloyd Austin) ఈ విషయాన్ని తెలిపారు. ఇరాక్, సిరియాల్లో ఉన్న అమెరికా దళాలను కాపాడుకునేందుకు ఆత్మరక్షణ దాడులకు పాల్పడినట్లు ఆయన చెప్పారు. ఇరాన్ సాయంతో దాడులకు పాల్పడుతున్న మిలిటెంట్ గ్రూపులను కట్టుడి చేయాలన్న ఉద్దేశంతో అమెరికా వైమానిక దాడులు చేసినట్టు తెలుస్తోంది. తమ దళాలపై దాడులు చేస్తూనే, ఇరాన్ తన జోక్యాన్ని దాచి పెట్టే ప్రయత్నం చేస్తోందని మంత్రి ఆరోపించారు. ఈ దాడులు ఎక్కువైతే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని లాయిడ్ హెచ్చరించారు. ఇజ్రాయిల్, హమాస్‌తో సంబంధం లేకుండా ఈ దాడులు జరుగుతున్నాయన్నారు. ఇటీవల ఇరాన్ మిలిటెంట్లు చేసిన దాడిలో సిరియాలో ఉన్న అమెరికాకు చెందిన సుమారు 21 మంది సైనికులు గాయపడ్డారు.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం మరింత ముదిరింది. గాజాను సర్వనాశనం చేసే వరకు ఇజ్రాయెల్ వెనక్కి తగ్గట్లేదు. తాజాగా ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో 7700 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మృతుల్లో దాదాపు 300 మందిని గుర్తించలేదు. దీంతో గాజాలో పరిస్థితి రోజూలాగే శనివారం కూడా భయం భయంగా గడిచిపోయింది. మరోవైపు మూడు వారాల క్రితం ప్రారంభమైన ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో మృతుల సంఖ్య 9 వేలు దాటింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో రక్తపుటేరులు పారుతున్న వేళ.. ఇప్పుడు ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. హమాస్ దాడులకు ఇజ్రాయెల్ దీటుగా బదులిస్తోంది. ఈ క్రమంలో వేలాది మంది మరణిస్తున్నారు.