ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో రాజకీయపార్టీల ప్రచారం జోరందుకుంది. అన్ని పార్టీలు భారీ వాగ్దానాలతో, ఉచిత పథకాలతో మేనిఫెస్టోలను విడుదలచేశాయి.. రాయలసీమ కరువు మాత్రం ఏ పార్టీకీ పట్టలేదు. అధికార వైసీపీ కానీ, తెలుగుదేశం, జనసేన కూటమి కానీ తమ మేనిఫెస్టో లో రాయలసీమ కరువు నివారణకు స్పష్టమైన ప్రణాళికలు ఏవీ ప్రకటించలేదు. నాలుగేళ్లుగా దారుణమైన కరువుతో రాయలసీమ అల్లాడి పోతోంది. నాలుగు జిల్లాల్లో 87 మండలాల్లో జనం కటకట పడుతున్నారు. వర్షాభావం కారణంగా 2020 నుంచి ఖరీఫ్ లో 50 శాతమే సాగు అయితే, రబీలో సాగు 20 శాతం కన్నా తక్కువే… భీషణ వాగ్దానాలు చేస్తున్న పార్టీలకు సీమ కరువు పట్టదా?
వర్షాభావంతో అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో దుర్భర పరిస్థితి నెలకొంది. రైతన్నలు గగ్గోలు పెడుతున్నారు. ఖరీఫ్ లేదు.. రబీలేదు.. నాలుగేళ్లుగా సాగు సాగడం లేదు. 87 మండలాల్లో తీవ్ర దుర్భిక్షం నెలకొంది.. మరి కొన్ని మండలాల్లోనూ వర్షాభావమే.. పూర్తిగా వర్షాధారం పైనే ఆధారపడిన అనంతపురం జిల్లా రైతాంగం ఇక్కట్ల పాలయ్యారు. సాగు యోగ్యమైన పంట పొలాల్లో 83.67శాతం బీడువారింది. రాయలసీమ.. రతనాల సీమ అంటాయి రాజకీయ పార్టీలు … రాయలసీమ గత నాలుగేళ్లుగా తీవ్ర కరువుతో అల్లాడుతున్నా రాజకీయ పార్టీలు, ప్రభుత్వ సంస్థలు పట్టించుకోవడం లేదు. ప్రధాన రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టో ల్లో పర్యావరణం, జలవనరుల నిర్వహణకు సంబంధించి అంశాలు ప్రస్తావించాయే తప్ప, శాశ్వత జలవనరుల కల్పన, నిర్వహణ, ఆగ్మెంటెడ్ ఇరిగేషన్ వాటర్ ప్రాజెక్టుల ద్వారా కరవు నివారణకు సంబంధించి నిర్దుష్టమైన ప్రతిపాదనలు చేయలేదు.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆనకట్టలు , నీటి వనరులలో నిల్వను మెరుగుపరచడం, భూగర్భజలాల పెంపు అంశం ప్రస్తావించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, సామాజిక సంస్థలను, రైతులను, పంచాయతీలు, గ్రామ సభలు, మున్సిపాలిటీలను నీటి నిర్వహణ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసే అంశాన్ని ప్రస్తావించింది. నీటి లభ్యత, నీటి వనరుల పెంపునకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చింది. ఇక భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి కృషి యోజన కింద 2.55 మిలియన్ హెక్టార్ల కు సాగునీటి సౌకర్యం కల్పిస్తామని, సమర్థవంతమైన నీటి నిర్వహణ కోసం సాంకేతిక ఆధారిత నీటిపారుదల కార్యక్రమాలను అమలు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది.
అధికార వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, టీడీపీ – బీజేపీ – జనసేన మేనిఫెస్టో కానీ.. రాయలసీమ కరువు నివారణకు స్పష్టమైన ఒక్క ప్రతిపాదనను కూడా మేని ఫెస్టోలో పేర్కొనలేదు. ఏ పార్టీ మేనిఫెస్టో కరువు మౌలిక కారణాలపై దృష్టి పెట్టలేదు. శాశ్వత ప్రాతిపదికన కరువు పరిష్కరించడానికి ఖచ్చితమైన ప్రణాళికను అందించలేదు. శాశ్వత నీటి వనరుల సృష్టి, నిర్వహణ, నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా కరువు నివారణకు గణనీయమైన చర్యలను మేని ఫెస్టోలో ప్రస్తావించనే లేదు. జాతీయ స్థాయి పార్టీలు సమగ్ర పరిశోధనతో రాష్ట్ర సమస్యలపై దృష్టి పెట్టి, స్పష్టమైన పరిష్కారాలను సూచించాలని వ్యవసాయ రంగ నిపుణులు కోరుతున్నారు, కానీ రాజకీయ పార్టీలకు ఆ ఊసే పట్టదు.
రాయలసీమలో దాదాపు 11 లక్షలహెక్టార్ల సారవంతమైన నల్లఒండ్రు నేల ఉంది. ఈ ప్రాంతంలో ప్రధాన పంట వేరుశెనగ. వర్షాభావం వల్ల పంటసాగు గమనీయంగా తగ్గింది. నాలుగేళ్లుగా రుతుపవనాలు చిన్నచూపు చూడడంతో 50 శాతానికి పైగా పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇక సీఎం జగన్ సొంత జిల్లా కడపలో రైతుల పరిస్థితి ఏమంత మెరుగ్గాలేదు. కడప బిడ్డ అయినా కరువు పరిష్కారానికి మేనిఫోస్టోలో స్పష్టమైన వాగ్దానాలేవీ చేయలేదు. కేసీ కెనాల్ రైతులు తప్ప మిగతా రైతులు 50 శాతం భూముల్ని బీడు పెట్టేశారు. మేని ఫెస్టోలో సీమలో సాగు ప్రాజెక్టుల ప్రస్తావన ఉంటుందని ఎంతగానో ఆశించిన రైతులు నిరాశ నిస్పృహలకు లోనయ్యారు.
కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాలో 83.67 శాతం వర్షాధార వ్యవసాయమే. చిత్తూరు జిల్లాలో మొత్తం సాగు విస్తీర్ణంలో 52.79 శాతం మెట్టసాగు. మెట్టభూముల సాగు విస్తీర్ణంలో కర్నూలు జిల్లా 79.2 శాతంతో, వైఎస్సార్ జిల్లా 60.93 శాతంతో ఉన్నాయని ఓ అధ్యయనం చెబుతోంది. ఈ జిల్లాల్లో రైతులకు బావులు, బోరుబావులే దిక్కు. ఈ భూములపై ఆధారపడ్డ 82 శాతం రైతులు, రైతు కూలీలు.. ఆర్థికంగా మరింత కుదేలై పేదరికంలో మగ్గిపోతున్నారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం వల్ల ప్రయోజనం లేదు. దీంతో ఆదోని, కల్యాణ దుర్గం, మడకశిర, కదిరి లోని చిన్న సన్నకారు రైతులు, రైతు కూలీలు, బెంగళూరు, ఇతర నగరాలకు వలసపోతున్నారు
ఏపీ రెవెన్యూ శాఖ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ ఈ మధ్య 63 తీవ్ర కరువు మండలాలుగా, 24 సాధారణ కరువు మండలాలుగా ప్రకటించారు. ఈ జాబితా ప్రకారం ప్రకాశం జిల్లాలో 31 మండలాలు, కర్నూలులో 18 అనంతపురంలో 14, నంద్యాల జిల్లాలో 13, నెల్లూరులో 10, శ్రీ సత్యసాయి జిల్లాలో ఒక మండలం ఉన్నాయి. నిరుడు నవంబర్ లో 103 కరువుమండలాలను ప్రకటిస్తే.. ఎక్కువ రాయలసీమ మండలాలే. దీంతో మరిన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించి తక్షణ సహాయం అందించాలని, కరువు సహాయక పనులు చేపట్టాలని రాయలసీమ రైతాంగం.. కోరుతోంది. భవిష్యత్ లో నైనా రాయలసీమ కరువు పై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాలని, తమ మేనిఫెస్టోలలో కీలక పథకాలు ప్రకటించాలని ఆశిద్దాం.


