త్వరలోనే మరోసారి రాజకీయరంగ ప్రవేశం చేస్తానంటూ శశికళ చేసిన ప్రకటన తమిళనాడు రాజకీయాల లో దుమారం రేపింది. 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమిళనాడు రాజకీయాల నుంచి శశికళ అకస్మాత్తుగా మాయమయ్యా రు. అప్పటికి తమిళనాడులో అన్నాడీఎంకే రాజకీయాలకు శశికళే కేంద్ర బిందువుగా ఉన్నారు. అయితే తమిళ రాజకీయాల్లో శశికళ ఎంత పాపులర్ అయినా, ఆమెను వివాదాలు వెంటాడాయి. జయలలిత హయాంలో శశికళ ఏ స్థాయిలో చక్రం తిప్పారో తమిళనాడు ప్రజలు ఇప్పటికీ మరవలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ హస్తిన పెద్దల ఆదేశాలతోనే శశికళ రాజకీయాలకు గుడ్‌బై కొట్టారన్న ప్రచారం తమిళనాట బలంగా నెలకొంది.
తాజాగా తాను మరోసారి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు శశికళ పేర్కొన్నారు. తమిళనాడులో ఇప్పట్లో ఎన్నికలు లేవు. అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్లు టైముంది. ఈ నేపథ్యంలో తాను మరోసారి రాజకీయా ల్లోకి రాబోతున్నట్లు శశికళ ఇంత అకస్మాత్తుగా ప్రకటన చేయడం వెనుక మతలబు ఏమిటన్న ప్రశ్న తెర మీదకు వచ్చింది. శశికళ ప్రకటన వెనుక బీజేపీ అధిష్టానం ఉందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే ముందు ఇటు అన్నా డీఎంకే అటు బీజేపీ ఏదీ నిలబడలేకపోయింది. తమిళనాడులోని మొత్తం 39 లోక్‌సభ నియోజకవర్గాలను డీఎంకే కైవసం చేసుకుంది. అనేక సంవత్సరాలపాటు తమిళనాడును పాలించిన అన్నా డీఎంకే కనీసం ఒక్క సీటుకూడా గెలుచుకోలేకపోయింది. అంతేకాదు బీజేపీ కూడా బోణీ చేయలేక పోయింది.
ఈసారి లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తమిళనాడు వరకు భారతీయ జనతా పార్టీ ఒక ప్రయోగం చేసింది. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన అన్నామలై ఒక మాజీ ఐపీఎస్ అధికారి చేతిలో తమిళనాడు బీజేపీని పెట్టింది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యతను అన్నామలైకు వదలివేసింది. వాస్త వానికి తమిళనాడు రాజకీయ యవనికపై తాజాగా అవతరించిన కొత్త నాయకుడు అన్నామలై. ఆయన మౌలికంగా ఐపీఎస్ అధికారి. కర్ణాటక క్యాడర్‌లో చాలాకాలం పాటు పనిచేశారు. విధి నిర్వహణ లో నిక్క చ్చిగా పేరు తెచ్చుకున్నారు. సింగం అంటూ అభిమానులు పిలవడం మొదలెట్టారు. అయితే ఐపీఎస్ అధికారిగా కంటే రాజకీయవేత్తగా ప్రజలకు ఎక్కువ సేవ చేయవచ్చని అన్నామలై భావించారు. దీంతో 2019లో ఉద్యోగానికి రాజీనామా చేసి స్వంత రాష్ట్రమైన తమిళనాడుకు వచ్చారు.
అన్నామలై రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే సమయానికి తమిళనాట రాజకీయ శూన్యత ఉంది. అంతేకాదు కొన్ని దశాబ్దాల పాటు తమిళనాడు రాజకీయాలకు శాసించిన కరుణానిధి, జయలలిత ఇద్దరూ భౌతికంగా లేరు. దీంతో ద్రవిడ రాజకీయాలను శాసించే నాయకుల కొరత ఏర్పడింది. ఈ దశలో తండ్రి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఎంకే స్టాలిన్ , డీఎంకే పగ్గాలు చేపట్టారు. మరోవైపు అన్నా డీఎంకే గ్రూపుల మయంగా మారింది. పళనిస్వామి, పన్నీర్ సెల్వం ముఠాలుగా అన్నా డీఎంకే చీలిపోయింది. ఇదిలా ఉంటే తమిళనాడు బీజేపీ పగ్గాలు అన్నామలై పగ్గాలు చేపట్టిన తరువాత పార్టీలో జోష్ పెరిగింది. తమిళనాట కొన్ని దశాబ్దాలుగా ఏదో ఒక ద్రవిడ పార్టీకి జూనియర్ పార్ట్‌నర్‌గా ఉన్న బీజేపీని ఒక స్వతంత్ర రాజకీయపార్టీగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి అన్నామలై తీసుకెళ్లారు. ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిరోజూ ఏదో ఒక ఆందోళనా కార్యక్రమం చేపట్టారు అన్నామలై. మరోవైపు తమిళనాడులో సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించారు. దీంతో తమిళనాట సామాన్య ప్రజలకు అన్నామలై బాగా దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో తాజా లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాట బీజేపీ ఒంటరి పోరాటం చేసింది. అన్నామలై నాయకత్వంపై కమలం పార్టీ హస్తిన పెద్దలు భరోసా పెట్టుకున్నారు. అయితే తాజా ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం మిగిలింది. కనీసం కోయంబత్తూరు నుంచి పోటీ చేసిన అన్నామలై కూడా గెలవలేకపోయారు.
ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల పట్ల భారతీయ జనతా పార్టీ పునరాలోచనలో పడ్డట్టు హస్తిన రాజకీయ వర్గాల సమాచారం. తమిళనాట స్టాలిన్ దూకుడుకు బ్రేకులు వేయడానికి అన్నామలై ఒక్కడే సరిపోడన్న నిర్థారణకు వచ్చినట్లు తెలిసింది. ఇందులో భాగంగా శశికళను మరోసారి రాజకీయాల్లోకి దింపాలన్నది కమలం పార్టీ పెద్దల ప్రణాళిక అని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ పేర్కొన్నాయి. దీనికి కారణం లేకపోలేదు. ఇండియా కూటమిలో డీఎంకే నమ్మకమైన భాగస్వామ్య పక్షంగా ఉంది. కేవలం డీఎంకే వల్లనే తమిళనాట కాంగ్రెస్ పార్టీ తొమ్మిది లోక్‌సభ సీట్లు గెలుచుకుందన్న విషయం గుర్తించారు కమలనా థులు. అంతేకాదు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి నమ్మకస్తుడిగా ఎంకే స్టాలిన్ కు రాజకీయవర్గాల్లో పేరుంది.
తమిళనాడు అసెంబ్లీకి మరో రెండేళ్లలో ఎన్నికలు జరగబోతున్నాయి. శాసనసభ ఎన్నికల నాటికి డీఎంకే కు ప్రత్యామ్నాయంగా అన్నాడీఎంకే ను తయారు చేయాలన్నది ఢిల్లీ బీజేపీ పెద్దల వ్యూహంగా కనిపి స్తోంది. ఈ రెండేళ్లలో ఎటూ స్టాలిన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందనీ, దీనిని అన్నా డీఎంకే ఓట్ల రూపంలో మరల్చుకోవాలన్నది భారతీయ జనతా పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది. అలాగే అన్నా డీఎంకే నాయకులెవరికీ ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ఢీ కొట్టే సత్తా లేదన్న నిర్థారణకు బీజేపీ అగ్రనాయ కత్వం వచ్చింది. ఈ పరిస్థితుల్లో రాజకీయంగా వనవాసంలో ఉన్న శశికళను మళ్లీ బరిలోకి దించి స్టాలిన్ కు సరి జోడుగా నిలపాలన్నది కమలం పార్టీ పెద్దల వ్యూహం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.ఇక్కడో విషయం గమనించాలి. కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ బీజేపీ పెద్దలతో శశికళ టచ్‌లో ఉన్నట్లు చెన్నై పొలిటికల్ సర్కిల్స్ టాక్. తమ మాట మీద గౌరవంతో మూడేళ్ల కిందట యాక్టివ్ పాలిటిక్స్ కు శశికళ ఎండ్ కార్డ్ వేసిన విషయాన్ని కూడా భారతీయ జనతా పార్టీ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ పెద్దల ప్రోద్బలంతోనే తమిళనాడులో మళ్లీ అమ్మ పాలన తీసుకువస్తానని శశికళ ప్రకటన చేసి ఉంటారన్నది రాజకీయ పరిశీలకుల అంచనా. త్వరలో తమిళనాట రాజకీయాలు శరవేగంగా మారబోతున్నాయి. మరో రెండేళ్లలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ, అన్నాడీఎంకే, సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళిగ వెట్రి కళగం ఒక జట్టుగా పోటీ చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ స్టాలిన్‌కు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇవ్వకూడదని కమలం పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఒక వైపు శశికళ జనాకర్షణ, మరోవైపు హీరో విజయ్ సినీ ఇమేజ్, ఇంకోవైపు ప్రధాని నరేంద్ర మోడీ ఛరిష్మాతో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జెండా ఎగరేయాలని కమలం పార్టీ పక్కా ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది.


