తెలంగాణ కాంగ్రెస్‌లో అలజడి రేగింది. పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అవడం ప్రస్తుతం ఆ పార్టీలో చర్చనీయాంశమైంది. ఈ సమావేశం ఎక్కడ జరిగింది..? ఎవరెవరు వెళ్లారు.? ఎందుకంత రహస్యంగా సమావేశమయ్యారు.? ఇప్పుడు ఇవే ప్రశ్నలు కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
హైదరాబాద్ సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌లో పది మంది ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారు. ఓ కేబినెట్ మంత్రి వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తితో ఈ సమావేశం జరిగినట్టుగా తెలుస్తోంది. తమను అసలు పట్టించుకోవడం లేదని … ఆ అసంతృప్తితోనే భేటీ అయినట్టుగా తెలుస్తోంది. ఈ రహస్య మీటింగ్ లో భవిష్యత్తు కార్యాచరణపై కూడా సమాలోచనలు జరిపినట్టుగా సమాచారం. ఇక ఈ సమావేశంలో పాల్గొన్న ఇద్దరు ఎమ్మెల్యేలు రెండు రోజుల కిందట సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిశారట.
అయితే అంతా రహస్యంగానే జరిగినా. .. ఆ ఫామ్ హౌస్ ఎవరిది?..ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరు? .. ఏ మంత్రిపై అసంతృప్తిగా ఉన్నారు…. అనే విషయాలు కూడా బయటకు వచ్చాయి. శుక్రవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో 10 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ శివారులో ఉన్న ఫామ్ హౌస్‌లో రహస్యంగా కలుసుకున్నారు. ఆ ఫామ్‌హౌస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి చెందినది. ఈ సమావేశంలో పాల్గొన్న వారిలో నాయిని రాజేందర్ రెడ్డి, భూపతి రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి. మురళీ నాయక్, కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, లక్ష్మీకాంత్, దొంతి మాధవ్, బీర్ల ఐలయ్య ఉన్నారు గంటన్నరపాటు కీలక అంశాలపై చర్చించారు. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా వీరంతా కలిసుకుని తమ తమ సమస్యలను వెళ్లబోసుకున్నారట. తమ ప్రాంతాల్లోని వ్యవహారాలు, కార్యక్రమాలను మంత్రి జాప్యం చేస్తున్నారని.. తమను అస్సలు పట్టించుకోవడం లేదని అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు ఇలా సమావేశమయ్యారు.
ఇక పది మంది ఎమ్మెల్యేలు ఇలా వేరుగా సమావేశం కావడం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారి తీసింది. సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు. అందుబాటులో ఉన్న కీలక నేతలతో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ అంశంపై చర్చించేందుకే సమావేశమవుతున్నామని చెబుతున్నప్పటికీ ఇది మాత్రం పది మంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశం కావడంపైనే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. అంతే కాదు పాలేరు పర్యటనను రద్దు చేసుకొని మరీ మంత్రి పొంగులేటి హడావుడిగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరుకున్నారు. అధికారులు ఎవరూ సమావేశానికి రావద్దని రేవంత్ రెడ్డి ఆదేశించారట.
స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని పార్టీ అధిష్టానం ఆందోళన చెందుతోంది. అసలే హస్తం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువ. ఇప్పుడు ఇదే ఆ పార్టీ అధిష్టానంలో టెన్షన్ పెడుతోంది.