హైదరాబాద్‌లోని హోటళ్లు, రెస్టారెంట్లలో టాస్క్ ఫోర్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో పలు హోటళ్లలో అక్రమాలు వెలుగు చూశాయి. నిర్వాహకులు ఫుడ్ సేప్టీని గాలికి వదిలేసినట్టు గుర్తించారు. ఎక్స్‌పైర్ ఫుడ్ ను విక్రయిస్తున్నట్లు తేల్చారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది. మజీద్ బండలో బిగ్‌బాస్కెట్ స్టోర్ ను ఫుడ్ సేప్టీ ఆఫీసర్లు సీజ్ చేశారు. ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
బిగ్ బాస్కెట్ స్టోర్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి,పలు లోపాలను గుర్తించారు. స్టోరేజ్ లో సరైన ప్రమాణాలను పాటించకపోవడంతో పాటు ఎక్స్పైరీ అయిపోయిన వస్తువులను గుర్తించారు. 5 కు పైగా పదార్థాలను ఎక్స్పైరీ అయినట్లు తేల్చారు. పాడైన అరటి పళ్ళు, సపోటా పళ్ళను గుర్తించి వాటిని పారవేశారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది పదార్థాల శాంపిల్స్ సైతం సేకరించారు.
అధికారుల నివేదిక ప్రకారం శేర్లింగంపల్లి జోన్ పరిధిలోని మజీద్ బండలో ఉన్న బిగ్ బాస్కెట్ స్టోర్ లో కూల్ డ్రింక్స్, ఫ్లేవర్డ్ మిల్క్ బాటిల్స్ ని రికమండేషన్ ప్రకారం సూచించిన పద్ధతిలో స్టోర్ చేయలేదు. సానిటరీ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ ని పక్కపక్కనే స్టోర్ చేశారు. ఫుడ్ హ్యాండిలర్స్, వెజిటబుల్ హ్యాండిలర్స్ కి గ్లౌజులు, ఆప్రాన్స్ లేవు. పాల సీసాలు, చిక్కటి షేక్ సీసాలు , స్టింగ్ టిన్ బాటిళ్లు తయారీదారు నిల్వ పరిస్థితుల ప్రకారం ఉంచలేదు. గడువు ముగిసిన చికెన్ మసాలా, పిజ్జా చీజ్, పనీర్, ఐస్‌క్రీమ్‌లు, ఆల్మండ్ లు ఉన్నాయి. మజీద్ బండలో ఉన్న బిగ్ బాస్కెట్ స్టోర్ లైసెన్స్ సస్పెండ్ చేశారు. ప్రజా ఆరోగ్య దృష్ట్యా మరికొన్నాళ్లపాటు ఇలాగే దాడులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.