లక్షద్వీప్ లోని మినికోయ్ ద్వీపంలో “ఐఎన్ ఎస్ జటాయు” పేరుతో భారత నౌకాదళం కీలక నౌకా స్థావరాన్ని ఏర్పాటు చేసింది. విశాలమైన హిందూ మహా సముద్ర ప్రాంతంలో, సముద్ర జలాల పరిరక్షణ, తీర ప్రాంత పరిరక్షణలో వ్యూహాత్మక స్థావరం గా ఐఎన్ ఏస్ జటాయు నిలుస్తుంది. ఐఎన్ ఎస్ జటాయు ఏర్పాటు ద్వారా హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన సైనిక ఉనికిని, పరిధిని భారతదేశం విస్తరించిన ట్లయింది. లక్షద్వీప్ దీవుల్లోని మినికోయ్ వద్ద ఐఎన్ఎస్ జటాయు అనే కొత్త నావికా స్థావరాన్ని ప్రారంభించారు. కొత్త ఔట్ పోస్ట్ ను నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ ప్రారంభించారు.
ఈ నౌకా స్థావరం భారత నౌకాదళం కార్యాచరణ సామర్థ్యాన్ని మరింత ఉద్దీపనం చేస్తుందని నేవి చీఫ్ అన్నారు. ఐఎన్ఎస్ జటాయు మినికోయ్ దీవుల్లో ఉంది. ఇవి పశ్చిమ సముద్రతీరంలో దక్షిణంగా ఉన్న ద్వీపాలని ఆయన పేర్కొన్నారు. సీతాదేవి అపహరణకు గురైనప్పుడు మొదట స్పందించి, రావణుని ఎదిరించిన జటాయువు పేరును దీనికి పెట్టారన్నారు. ఈ ప్రాంతంలో ఈ యూనిట్ ఫస్ట్ రెస్పాండర్ గా ఉంటుందని నేవీ చీఫ్ స్పష్టం చేశారు. మాల్దీవులకు సమీపంలో ఈ స్థావరం నిర్మించడం వ్యూహాత్మకంగా కీలకం కాగలదు.


