కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణలపై ఆరా తీస్తోంది జస్టిస్ చంద్రఘోష్ కమిషన్. ఇప్పటి వరకూ సాంకేతిక లోపాలపై దృష్టిసారించిన కమిషన్.. ఇప్పుడు ఆర్థిక అవకతవలకపై కూపీ లాగుతోంది. ఈ క్రమంలోనే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌ల నిర్మాణంలో 50 మందికి పైగా సబ్‌కాంట్రాక్టర్లు ఉన్నట్టు గుర్తించింది. బ్యారేజ్ పనులు దక్కించుకున్న నిర్మా ణ సంస్థలు చాలా పనులను నిబంధనలకు విరుద్ధంగా సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించినట్టు కమిషన్ నిర్థారణకు వచ్చింది. గత ప్రభుత్వంలోని ఓ ముఖ్యనేత సమీప బంధువులకు చెందిన కంపెనీలు సైతం సబ్ కాంట్రాక్టులు పొందినట్టు తెలుస్తోంది.
ముందుగా జారీ చేసిన పరిపాలనాపరమైన అనుమతి ఎంత? మధ్యలో ఎన్నిసార్లు అంచనాలను సవరించారు? వాస్తవ వ్యయం ఎంత? గడువులోగానే పనులు పూర్తి చేసినప్పుడు అంచనా వ్యయం పెంచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సబ్ కాంట్రాక్టర్లకు ఏ పనులు కట్టబెట్టారు? వారికి ఎంత చెల్లించారు? ఈ వ్యవహారంలో అవకతవకలు ఏమైనా జరిగాయా? వంటి అంశాలపై ఆరా తీస్తోంది. ఇందుకోసం లోతుగా విచారించేందుకు ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌ను కమిషన్ కార్యాలయంలో నియమించాలని ప్రభుత్వా న్ని కమిషన్ కోరింది. విచారణలో క్రాస్ ఎగ్జామినేషన్‌కు వీలుగా తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌తో సంబంధం లేని న్యాయవాదిని కూడా సమకూర్చాలని విజ్ఞప్తి చేసింది.


