India will become most Population Country in the World: భారతదేశం నిజంగానే ప్రపంచాన్ని దాటి వెళ్లిపోతోంది. ఎందులో పెరిగిపోతోందని మీరు అనుకుంటున్నారా?
అంటే దేశాభివృద్ధిలో అనుకుంటున్నారా? కాదండి,
మరి ఆర్థికాభివృద్ధిలోనా? అని అడుగుతున్నారా? అంటే అదీ కాదండీ…
మరి…శాస్త్ర సాంకేతిక రంగాలలో అనుకుంటున్నారా?
అయ్యయ్యో… అదీ కాదండి బాబూ!…మరెందులోనండీ
జనాభాలోనా?
అవునండీ…అవును… మీరు చెప్పింది నిజమే…
జనాభాలోనే మన దేశం…ప్రపంచంలో నెంబర్ వన్ కాబోతున్నాం. కరెక్టుగా మరో రెండునెలల్లో చైనాని మించిపోనుందని ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ‘ఫ్యూ రీసెర్చ్’ సంస్థ అంచనా వేస్తోంది.
ఒకవైపు ఇప్పటికే ఉన్న జనాభా ఉండటానికి తగినంత స్థలం లేక, రెండు పూటలా తిండిలేక అవస్థలు పడుతున్న పరిస్థితుల్లో జనాభా పెరిగిపోతే…అది దేశార్థిక వ్యవస్థపై పెనుభారం పడుతుందని పలు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇందులో ఆనందించతగిన అంశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే మన భారతదేశం 2100 నాటికి యువ భారతదేశంగా అవతరించనుంది. అప్పటికి మన దేశ జనాభాలో 40 శాతం యువకులే ఉంటారని ఫ్యూ రీసెర్చ్ సంస్థ చెబుతోంది. దీనివల్ల యువశక్తితో నిండిన భారతదేశం అన్నిరంగాల్లో వేగవంతమైన అభివృద్ధిని సాధిస్తుందని వారు అంచనా వేస్తున్నారు.
అప్పటికి చైనా సగటు వయసు 39 అయితే, అమెరికా 38 వరకు వెళుతుంది. ఇండియా మాత్రం 28 గా ఉంటుందని చెబుతున్నారు. అంటే ప్రతీ పదిమందిలో నలుగురు 25ఏళ్ల లోపు వారేనని చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే ఈ శతాబ్దం చివరి వరకు భారతదేశం యువభారత్ గానే ఉంటుంది.
స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950లో భారతదేశ జనాభా 35.3 కోట్లు. 72ఏళ్లలో 100 కోట్లకు పెరిగిపోయింది. యుఎస్ వో అంచనా ప్రకారం 2070 నాటికి 170 కోట్లకు భారతదేశ జనాభా పెరుగుతుందని, అప్పటి నుంచి మందగిస్తుందని అంటున్నారు.
అమ్మాయిలు-అబ్బాయిల లింగ భేదంలో చూస్తే ఎప్పటిలాగే అబ్బాయిలెక్కువ… అమ్మాయిలు తక్కువగా ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 111మంది బాలురకి 100మంది మాత్రమే బాలికలు ఉన్నారు. 2021లో కరోనా కారణంగా జనాభా లెక్కలు సాధ్య పడలేదు. మళ్లీ ఎప్పుడు చేస్తారో తెలీదు. ప్రస్తుతానికి 2019 లెక్కల ప్రకారం 108మంది అబ్బాయిలకు 100మంది మాత్రమే అమ్మాయిలు ఉన్నారు.
ఇదండీ సంగతి…మరో రెండు నెలల్లో భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా పేరు ప్రఖ్యాతులను పొందబోతోంది.