India vs new zealand 3rd T 20 matchHigh lights: న్యూజిలాండ్ తో జరిగిన నిర్ణయాత్మక మూడో టీ-20లో భారత్ అదరగొట్టింది. 168 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి 2-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది. నిజానికి న్యూజిలాండ్ తో జరిగిన మొదటి టీ-20 మ్యాచ్ లో ఓడిపోవడంతో, సిరీస్ పోతుందేమోనని అభిమానులు ఆందోళన పడ్డారు. తర్వాత రెండో టీ 20 మ్యాచ్ లో 100 పరుగుల లక్ష్యాన్ని పడుతూ లేస్తూ గెలిచారు. చివరికి బతుకుజీవుడా? అంటూ రేస్ లోకి వచ్చారు.
ఇన్ని సందేహాల మధ్యలో నిర్ణయాత్మక మూడో టీ-20 మ్యాచ్ జరిగింది. అయితే వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని ధనాధన్ ఇన్నింగ్స్ తో మోత మోగించింది. శుభ్ మన్ గిల్ సూపర్ సెంచరీ (63 బంతుల్లో 126, 12 ఫోర్లు, 7 సిక్సర్లు)తో స్కోర్ బోర్డు పరుగులు తీసింది. అయితే ఓపెనర్స్ గా వచ్చిన ఇషాన్ కిషాన్ మళ్లీ నిరాశ పరిచాడు. 1 పరుగుకే వెను తిరిగాడు.
రాహుల్ త్రిఫాఠీ వచ్చీ రాగానే ధడధడ లాడించాడు. (22 బంతుల్లో 44 పరుగులు, 4 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (13 బంతుల్లో 24 , 1 ఫోర్, 2 సిక్సర్లు) హార్దిక్ పాండ్యా (17 బంతుల్లో 30 , 4 ఫోర్లు, 1 సిక్స్) చితక్కొట్టి స్కోరు బోర్డును పరుగులెత్తించారు. 20 ఓవర్లలో 234 పరుగుల భారీ స్కోర్ సాధించి…న్యూజిలాండ్ ముంగిట పెట్టింది.
ఓవర్ కి 11.8 రన్ రేట్ తో అంటే యావరేజ్ న ఓవర్ కి 12 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో పేసర్లు హార్దిక్ (4 /16), అర్షదీప్ సింగ్ (2/12), ఉమ్రాన్ మాలిక్ (2/9) చెలరేగిపోవడంతో న్యూజిలాండ్ బ్యాట్స్ మేన్ చేతులెత్తేశారు. ప్రతి ఓవర్ కి రన్ రేట్ పెరిగిపోతుండటంతో న్యూజిలాండ్ బ్యాట్స్ మేన్ ప్రతి బాల్ హిట్టింగ్ కి వెళ్లి వికెట్లు సమర్పించుకున్నారు. 12.1 ఓవర్లలో 66 పరుగులకే ఆలౌట్ అయ్యి, మ్యాచ్ ని ఏకపక్షం చేసేశారు. 168 పరుగుల భారీ తేడాతో ఇండియా గెలిచి సిరీస్ దక్కించుకుంది.
డారిల్ మిచెల్ (35), మిచెల్ సాంటర్న్(13) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. బౌలింగ్ లో బ్రేస్ వెల్, టిక్నర్, సోథీ, డారెల్ మిచెల్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. కివీస్ పర్యటనలో మూడు వన్డేల సిరీస్ ను 0-3తో ఓడిపోయింది. టీ-20 సిరీస్ ను కోల్పోయింది. టీమ్ ఇండియా తర్వాత ఆసీస్ తో నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడనుంది.
రాహుల్ త్రిపాఠి మెరుపు ఇన్నింగ్స్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. భారీ స్కోర్ సాధించాలనే పట్టుదలతో వచ్చి…ఒక భారీ సిక్సర్ తో హాఫ్ సెంచరీ చేద్దామని..లాంగ్ ఆన్ లో దొరికిపోయాడు. దాంతో త్రిపాఠి అసహనంతో రగిలిపోయాడు. బ్యాట్ ని నేలకేసి కొట్టేస్తాడేమోనని అంతా అనుకున్నారు. కానీ అభిమానులు అతని బాధను అర్థం చేసుకుని, సపోర్ట్ చేస్తూ కామెంట్లు పెట్టారు.