న్యూస్‌రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూత
దూరదర్శన్ మాజీ న్యూస్‌రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన .. మలక్‌పేట యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాసేపట్లో శాంతి స్వరూప్ భౌతికకాయాన్ని డీడీ కాలనీలో స్వగృహానికి తరలించనున్నారు.
టీడీపీ అంటే.. ఒక బలం
టీడీపీ అంటే ఒక బలం, ఒక శక్తి అన్నారు రాయదుర్గం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కాల్వ శ్రీనివాసులు. అంతటి శక్తి ఉన్న పసుపు జెండాను ప్రజలు ఆదరించి విజయాన్ని అందించాలని కోరారు. బొమ్మనహాల్ మండలం కృష్ణాపురం గ్రామంలో జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు ప్రజలు బ్రహ్మరధం పట్టారు. జగన్ ఐదేళ్ల అరాచక పాలనపై మండిపడ్డారు. వైసీపీ అభ్యర్ధి గోవిందరెడ్డికి ఓటు వేస్తే చెత్తబుట్టలో వేసినట్లే అన్నారు కాల్వ.
షర్మిలపై ఘాటు వ్యాఖ్యలు
మాట తప్పి మడమ తిప్పిన వైఎస్ షర్మిల గురించి పెద్దగా పట్టించుకోనవసరం లేదన్నారు పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి. తెలంగాణాలో చాప చుట్టేసి ఏపికి వచ్చిన ఆమె వల్ల ప్రయోజనం శూన్యమన్నారు. అనైతిక పొత్తుతో ముందుకు వచ్చిన బిటెక్ రవికి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదన్నారు.
జనసేనలోకి భారీగా చేరికలు
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గ పరిధిలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ప్రస్తుత, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, సొసైటీ మాజీ డైరెక్టర్లు పార్టీ కండువా కప్పుకున్న వారిలో ఉన్నారు. తమ అనుచరులతో భారీగా తరలి వచ్చిన వీరికి కొత్తపల్లి సుబ్బారాయుడు, బొమ్మిడి నాయకర్ సాదరంగా స్వాగతం పలికి అభినంద నలు తెలిపారు.
జగన్‌ది సుపరిపాలన
పెన్షన్ కోసం వచ్చిన వృద్దురాలు వడదెబ్బకు గురై మృతిచెందటం బాధాకరమన్నారు రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి మెట్టు గోవిందరెడ్డి. మృతురాలు హనుమక్క కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. గత ఐదేళ్లుగా ఒకటవ తారీఖునే పెన్షన్ అందజేసిన ఘనత వైసీపీ దన్న గోవిందరెడ్డి, అభివృద్ధి సంక్షేమ కార్య క్రమాలు యథావిధిగా కొనసాగాలంటే వైసీపీ ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు.
వీడియో డేటా విశ్లేషణ
జేఈఈ-మెయిన్ పరీక్షల నిర్వహణ అనంతరం ఎగ్జామ్ సెంటర్ల వీడియో డేటాను విశ్లేషిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA పేర్కొంది. ఎవరైనా మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. భారీ జరిమానాలతోపాటు ఇకపై పరీక్ష రాయకుండా నిషేధం వంటి చర్యలు ఉంటా యని స్పష్టం చేసింది. అభ్యర్ధుల రిమోట్ బయోమెట్రిక్ మ్యాచింగ్ కోసం ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీని వాడుతున్నట్లు ఏజెన్సీ పేర్కొంది.
శివాజీ విగ్రహం ధ్వంసం
మేడ్చల్ పట్టణ పరిధి బొడ్రాయి సమీపంలో శివాజీ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేసారు. ఆరేకటిక సంఘం వారు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. దీంతో సంఘ సభ్యులు ఘటనా స్ధలానికి చేరుకుని సీసీ కెమెరాలను పరిశీలించారు. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనపై ఆరేకటిక సంఘం ఇచ్చిన ఫిర్యాదుతో మేడ్చల్ పోలీసులు విచారణ చేస్తున్నారు.
అనుమానాలు అనేకం
దేశీయంగా ఉత్పత్తి చేసిన బయో క్లాక్ డ్రింక్స్ ఉత్పత్తుల ప్రీమియం శ్రేణిని బయో ఇండియా సంస్ధ అధికా రికంగా హైదరాబాద్ మార్కెట్‌లోకి విడుదల చేసింది. అయుర్వేద వైద్యుడు డాక్టర్ బి. శ్రీనివాస అమర్ నాథ్ ఈ లిక్కర్‌ను సృష్టించగా, USFDA అనుమతి కూడా లభించిందని సంస్థ పేర్కొంది, అయితే ఈ ఉత్పత్తులపై సోషల్ మీడియాలో జోరుగా చర్చతోపాటు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ మద్యంపై పరిశోధన ఉందా… ఉంటే పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
నెట్‌వర్త్ విలువ సున్నా
బైజూస్ సంస్ధ వ్యవస్థాపకుడు రవీంద్రన్ నెట్‌వర్త్ విలువ 17 వేల కోట్ల నుంచి సున్నాకి మారిపోయింది. ఈ విషయాన్ని ఫోర్బ్స్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకటించింది. ఏడాది క్రితం వరల్డ్‌లోనే మోస్ట్ వాల్యూడ్ ఎడ్ టెక్ సంస్ధగా పేరుగాంచిన బైజూస్ మనీలాండరింగ్ ఆరోపణలతో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొని వరుస నష్టాల్ని చవిచూసింది.
థామస్, ఉబెర్ టోర్నమెంట్స్
ఈనెల 7 నుంచి మే 5 వరకు చైనాలో జరగబోయే ప్రతిష్టాత్మక థామస్, ఉబెర్ కప్ టోర్నీలకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భారత పురుషుల, మహిళల జట్లను ప్రకటించింది. 2022లో తొలిసారిగా థామస్ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత పురుషుల జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఈ టోర్నీలో అడుగుపెడుతోంది. కాగా ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీకి ప్రముఖ షెట్లర్ పీవీ సింధు దూరంగా ఉంది. ఈ ఏడాది జరగబోయే పారిస్ ఒలింపిక్స్‌కు సన్నద్ధమయ్యేందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మామూలుగా లేదుగా…
ఐపీఎల్ 17వ సీజన్ క్రికెట్ పోటీలను మొబైల్, టీవీల్లో వీక్షించే వారి సంఖ్య రికార్డులను సృష్టిస్తోంది. తొలి పది మ్యాచ్‌లను పరిశీలిస్తే… బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్-BARC డాటా ప్రకారం టీవీ, మొబైల్లో 35 కోట్ల మంది వీక్షించారు. గతేడాదితో పోలిస్తే ఇది 20 శాతం అధికంగా ఉంది.


