నిరుద్యోగ సమస్య ఎక్కడున్నా అది శాపమే. నైపుణ్యం కలిగిన విద్యావంతులు కొలువుల కోసం కాళ్లరిగేలా తిరిగినా ఫలితం దక్కక పోతే..ఆ మేధావి ఎంత కలత చెందుతాడు. ఎంత చదువుకున్నా, ఎంత నైపుణ్యమున్నా..నిరుద్యోగి అనే ముద్ర వల్ల ఇంటా, బయట ఆ మేధావి అకారణ అవమానాలు ఎదురు చూస్తాడు. అయితే, అవకాశాలు పుష్కలంగా ఉన్నా.. ఆ కొలువులు చేయడానికి తగిన నిపుణులు లేరు అంటే ఒకింత ఆశ్చర్యమే వేస్తుంది. ఇప్పుడు ఆ పరిస్థితే కనిపిస్తోంది. దేశంలో తాజాగా అక్షరాల పదకొండు రంగాల్లో నిపుణుల కొరత ఉన్నట్టు తెలుస్తోంది. ఆయా రంగాల్లో ఇంజనీరింగ్ కోర్సులు ప్రవేశపెడితే నిరుద్యోగ భూతాన్ని తరిమికొట్ట వచ్చని భావిస్తోంది.
కాలానుగుణ మార్పుల్లో…కొన్నింటికి డిమాండ్ ఏర్పడడం, మరికొన్ని రంగాలకు వన్నె తగ్గడం జరుగుతూంటుంది. ప్రస్తుతం నానో టెక్నాలజీ, సెమీకండక్టర్లు, ఏరో స్పేస్, డిఫెన్స్ టెక్నాలజీ, ఏఐ, రోబోటిక్స్, డ్రోన్ టెక్నాలజీ తదితర పదకొండు రంగాలను సర్కారు గుర్తించింది. ఇందుకు సంబంధించిన కోర్సుల్లో అధిక మొత్తంలో బీటెక్ సీట్లు ఉండేలా ప్రోత్సహించాలని రాష్ట్ర సర్కారు అఖిల భారత సాంకేతిక విద్యామండలికి సూచించినట్టు తెలిసింది.
అదనపు సీట్లు, కొత్త కోర్సుల మంజూరుకు అయిదు కొలమానాలను ప్రామాణికంగా తీసుకుని ఎన్ వో సీ జారీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ తెలియజేసింది. డిమాండ్ ఉన్న నానో టెక్నాలజీ సెమీకండక్టర్స్, ఏరో స్పేస్ ఇంజనీరింగ్, స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, వాతావరణ ఇంజనీరింగ్, రెన్యువబుల్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ తదితర విభాగాలపై ఫోకస్ చేయాలని రాష్ట్ర సర్కారు పేర్కొంది.
వైద్య రంగంలో ఉదయిస్తున్న ఛాలెంజ్ లు, ఫుడ్ సేఫ్టీ ప్రొబ్లెంలు అధికం అవుతున్నందున బయో టెక్నాలజీపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితులు వచ్చాయని సర్కారు తెలిపింది. సింథటిక్, బయాలజీ, అగ్రికల్చర్ బయో టెక్నాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్ పై కాన్సన్ట్రేషన్ చేయాలని తెలిపింది.
ఇక ఏఐ, రోబోటిక్స్, డ్రోన్ టెక్నాలజీ ఆవశ్యకత ఎంతో అందరికీ తెలిసిందే. వీటివల్ల ఏకంగా పరిశ్రమలే ఆటోమేషన్ అయిపోతున్నాయి. ఈ నేపథ్యంలో త్రీ డీ ప్రింటింగ్ టెక్నాలజీ, ఏఆర్, వీఆర్ కోర్సుల చదువులు చాలా అవసరం. ఇదేరీతిలో కాగ్నిటివ్ రోబోటిక్స్ కోర్సుల ఆవశ్యకత ఎంతో ఉంటుంది.
సాగర వనరులు, రెన్యువబుల్ ఎలక్ట్రిసిటీ పై దృష్టి పెరిగినందు వల్ల మెరైన్ ఓషన్ ఇంజనీరింగ్ పైనా దృష్టి సారించాల్సివుంది. డేటా సెక్యూరిటీ, డేటా ఎనాలసిస్ కోసం క్వాంటమ్ కంప్యూటింగ్, టెక్నాలజీ కోర్సులను ప్రవేశపెట్టాల్సి ఉంది. సుస్థిర ఆహార ఉత్పత్తి అవసరం అధికం అవుతున్నందువల్ల ఫుడ్ టెక్నాలజీ, అగ్రిటెక్ లో పెద్ద ఎత్తున నిపుణులు అవసరం అవుతారు. దీనిపై దృష్టి సారించాల్సి ఉంది.
ఇదే రీతిలో హెల్త్ టెక్నాలజీ, డిజిటల్ హెల్త్ పైనా దృష్టి పెట్టాల్సి ఉంది. మారుమూల కుగ్రామాల్లో వున్న రోగుల పర్యవేక్షణకు మెడికల్ రంగం డిజిటల్ వైపునకు అడుగులేస్తోంది. ఆసుపత్రులు, హెల్త్ టెక్ స్టార్టప్స్, త్రీ డీ ప్రింటింగ్ ద్వారా బయో మెడికల్ ఇంప్లాంట్స్ తయారీ సంస్థలతో అగ్రిమెంట్లు చేసుకుని ముందుకెళ్లాల్సి ఉంది. రూరల్ పైనే కాకుండా అర్బన్ ఇన్ ఫ్రా, స్మార్ట్ సిటీస్ పైనా దృష్టి పెట్టాల్సి ఉంది. ఎందుకంటే పట్టణీకరణ వల్ల ఐవోటీ స్మార్ట్ సిస్టమ్స్, రెన్యువబుల్ అర్బన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ తదితర రంగాలకు మంచి డిమాండ్ ఉంది.