రానున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరిగి భీమవరం నుంచి పోటీ చేస్తారా.. పవన్ ప్రసంగంలో ఈ భావమే వ్యక్తం అయింది. 2019లో తాను భీమవరం నుంచి ఎన్నికై ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని పవన్ కల్యాణ్ అన్నారు. తాను ఓటమి పాలైనా భీమవరాన్ని వదిలి పెట్ట బోనని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ .. జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పై చేసిన వ్యాఖ్యలు మాటల యుద్ధానికి దారితీసింది.
మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా భీమవరం నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన కార్య కర్తల నుద్దేశించి పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ 2019 ఎన్నికల్లో భీమవరంలో తాను గెలిచిఉంటే.. పరిస్థితి మరోలా ఉండేదని అన్నారు. ఎమ్మెల్యేగా ఓడినా జనం గుండెల్లో స్థానం బలాన్ని ఇచ్చిందన్నారు. ఎవరె న్ని కోట్లు పంచినా భీమవరంలో గెలుపు తమదేనని పవన్ ధీమా వ్యక్తం చేశారు.
ఏపీ నుంచి జగన్ ను, భీమవరం నుంచి గ్రంథి శ్రీనివాస్‌ను తరిమేయాలని పవన్ కల్యాణ్ కార్యకర్తలకు పిలుపుని చ్చారు. వీధి రౌడీని ఎమ్మెల్యేను చేశారని మండిపడ్డారు. గ్రంధి శ్రీనివాస్ ను జలగతో పోలుస్తూ. గ్రంధి శ్రీనివాస్ ఓ క్రిమినల్ అనీ, వీళ్లంతా మర్రి చెట్టులా వేళ్లూనుకుపోయారని.. జగన్ తో పాటు ఆయన జలగలనూ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని పవన్ కల్యాణ్ అన్నారు. మే 15 లోపు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తథ్యం అని పవన్ కల్యాణ్ అన్నారు. భీమవరంలో ప్రపంచంలోనే అత్యంత కోటీశ్వరులు ఉన్న నగరం అంటూ.. ఇది ఒక రౌడీ చేతిలో ఇరుక్కుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. భీమవరంలో పార్టీ కార్యాలయానికి తాను స్థలం కొనాలనుకుంటే.. అమ్మడానికి వచ్చినవారే ఎమ్మెల్యేకి భయపడి వెనక్కి వెళ్లిపోతున్నారని చెబుతూ.. భీమవరంలో ఈ రౌడీ రాజ్యం అంతమవ్వాలన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ అడిగితే భీమవరంలో తన పేరున ఉన్న 9 ఎకరాలలో స్థలం ఇచ్చేవాడినని చెప్పారు. పక్కనుండే కాపు నాయ కులు ఎందుకు ఆయనకు దూరంగా ఉన్నారో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలన్నారు. తాను రౌడి ఎమ్మెల్యే అయితే.. ఒక్క క్రిమినల్ కేసైనా ఉందా అని ప్రశ్నించారు గ్రంధి శ్రీనివాస్.భీమవరం వేదికగా మాటల యుద్ధం సాగుతోంది. తాను ఓడిపోయినా.. తాను భీమవరంను వదిలి పెట్టబోనని పవన్ కల్యాణ్ స్పష్టం చేయడంతో.. ఆయన తిరిగి మళ్లీ భీమవరం నుంచి పోటీ చేయవచ్చునని జనసైనికులు భావిస్తు న్నారు. పవన్ పోటీ చేసినా తాను దీటుగా పోటీ ఇస్తానని ప్రస్తుత ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చెప్పడం కొసమెరుపు.