ఎన్నో సంచలనాల తర్వాత వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ వేడుకలు విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీలో జరిగాయి. అభిమానుల రద్దీతో ప్రాంగణం కిక్కిరిసి పోయింది. సంక్రాంతి పండగకి ముందే విశాఖకు పండగ వచ్చిందన్నంత గొప్పగా జరిగింది. వేదికపై నుంచి అందరూ మాట్లాడిన తర్వాత చిరంజీవి మైకు అందుకుంటూ…మీ విశాఖ వాసులకి తెలియని నిజం ఒకటి చెబుతున్నాను.
నేను ఇక్కడ ఒక స్థలం కొన్నాను.అది భీమిలీ వెళ్లే దారిలో ఉంది. అక్కడ మంచి ఇల్లు కట్టాలి. అయితే అది ఒక హాలిడే హోం గా కట్టుకోవాలని నాకెప్పటి నుంచో కోరిక… త్వరలోనే నేనూ విశాఖవాసున్ని అవుతానని అన్నారు.
ఇలాంటి అద్భుతమైన విశాఖపట్నంలో నేనూ ఒక పౌరుడిని అవుతున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఇది నా చిరకాల కోరిక అని తెలిపారు. నా సినిమాలు, పాటలు ఎన్నో షూటింగులు విశాఖ బీచ్ లో జరిగాయి. అందులో సూపర్ హిట్ సాంగ్ లు ఎన్నో ఉన్నాయని, అలా నాకు విశాఖతో ఎప్పటినుంచో విడదీయరాని బంధం ఏర్పడిందని అన్నారు.
నేను మనసు విప్పి చెప్పే మాటేమిటంటే, విశాఖపట్నం ప్రజలకు కుళ్లు, కుతంత్రాలు తెలీవు, స్వచ్ఛంగా ఉంటారు. సినిమాలు మాత్రం బాగుంటేనే చూస్తారని నవ్వుతూ అన్నారు. ఇక వైజాగ్ లోని సముద్రతీరం అంటే నాకు చాలా ఇష్టం. సాయంత్రమైతే ఆర్కే బీచ్ కి వచ్చి, కాసేపు కూర్చుని, కష్టాలన్నీ మరిచిపోయి, తిరిగి హాయిగా ఇంటికి వెళ్లిపోయే ప్రజల్లా…నేను కూడా ఉండాలని అనుకునే వాడిని. ఇదే విషయాన్ని తెలిసిన స్నేహితులు అందరితో పంచుకునే వాడినని అన్నారు. ఎందుకంటే రిటైర్మెంట్ అయినవాళ్లకి విశాఖపట్నం ఒక స్వర్గధామం లాంటిదని అన్నారు.
వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ను యాంకర్ సుమ హోస్ట్ గా చేయగా, చిరంజీవి, రవితేజ, ఊర్వశీ రౌటేలా, కేథరిన్ థెస్రా, డైరక్టర్ బాబీ, నిర్మాతలు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అందరూ సందడి చేశారు. చిరంజీవి తనదైన స్టైల్ లో మాట్లాడి అలరించారు. వైజాగ్ సిటీ అందం గురించి పైన చెప్పిన విధంగా మాట్లాడి విశాఖవాసుల మనసులను గెలుచుకున్నారు.