స్వతంత్ర వెబ్ డెస్క్: హర్యానాలోని సోనేపట్ జిల్లా పర్యటన సందర్భంగా అక్కడి రైతులతో గడిపిన సందర్భాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ గుర్తుచేసుకున్నారు. ఆ మేరకు అప్పటి ఓ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేస్తూ తన అనుభవాలను రాసుకొచ్చారు. ఆ వీడియోలో ఏముందంటే.. రాహుల్‌గాంధీ మహిళా రైతులతో ముచ్చటిస్తుండగా ఓ మహిళా రైతుకు, ఆయనకు మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది.
‘మాకు ఢిల్లీలో ఉన్న మీ ఇల్లు చూడాలని ఉంది..?’ అని మహిళా రైతు అడగ్గా ‘రండి.. రండి’ అని రాహుల్‌గాంధీ ఆహ్వానించారు. ఆ వెంటనే మళ్లీ అందుకుని ‘ఢిల్లీలో నాకు ఇల్లు లేదు. ప్రభుత్వం తీసేసుకుంది’ అని చెప్పారు. ఈ ఆసక్తికర సంభాషణ ఇప్పుడు ట్విటర్‌లో వైరల్ అవుతున్నది. ఇంకా ఆ పర్యటన అనుభవాలను రాహుల్‌గాంధీ ట్విటర్ ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. పర్యటన సందర్భంగా తాను సంజయ్ మాలిక్, తస్బీర్ కుమార్ అనే ఇద్దరు రైతు సోదరులను కలిశానని, వాళ్లు చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులని రాహుల్‌గాంధీ చెప్పారు. చాలా ఏళ్లుగా కలిసి వ్యవసాయం చేస్తున్నారని పేర్కొన్నారు. తాను వాళ్లతో కలిసి పొలాల్లో సాయం చేశానని, వరి నాట్లు వేశానని, ట్రాక్టర్ నడిపానని తెలిపారు. మహిళా రైతులు తన సొంత కుటుంబ సభ్యులలా ప్రేమను, గౌరవాన్ని ఇచ్చారని, రొట్టెలు తినిపించారని వెల్లడించారు.
దేశంలోని రైతులు నిజాయితీపరులు, తెలివిగలవారని, వారికి వారి హక్కుల గురించి తెలుసని పేర్కొన్నారు. అవసరమైనప్పుడు వారు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడతారని, అదేవిధంగా పంటకు సరైన కనీస మద్దతు ధర కోసం, పంటలకు బీమా కోసం గట్టిగా డిమాండ్ వినిపిస్తారని తెలిపారు. మనం వారి మాట విని, వారి అభిప్రాయాన్ని అర్థం చేసుకుంటే దేశంలోని అనేక సమస్యలు పరిష్కారమవుతాయని అభిప్రాయపడ్డారు. దేశానికి రైతే బలమని వ్యాఖ్యానించారు.