స్వతంత్ర వెబ్ డెస్క్: విండీస్ పై భారత్ ఘన విజయాన్ని సొంతం చేసుకుని సిరీస్ ను కైవసం చేసుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో భారత జట్టు విజయం సాధించింది. టీమిండియా మూడో వన్డేలో కూడా రోహిత్, విరాట్ కోహ్లీ లేకుండా బరిలోకి దిగినప్పటికీ యువ ఆటగాళ్లు.. తమ సత్తా చాటారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఇషాన్ కిషన్ (77), శుభమన్ గిల్ (85), సంజు శాంసన్ (51), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (70) అర్ధ సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 35 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్ రెండు వికెట్లు తీసుకున్నాడు.
బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ 35.3 ఓవర్లలో 151 పరుగులకే కుప్పకూలి ఓటమి పాలైంది. శార్దూల్ ఠాకూర్, ముకేశ్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ వేయడంతో విండీస్ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయింది. గుడకేష్ మోతీ చేసిన 39(నాటౌట్) పరుగులే జట్టులో అత్యధికం. అలిక్ అథనాజ్ 32, యనిక్ కరియ 19, అల్జారీ జోసెఫ్ 26 పరుగులు చేశారు. ఆ జట్టులో ఏడుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే అవుటయ్యారు. శార్దూల్ 4, ముకేశ్ కుమార్ 3 వికెట్లు తీసుకోగా కుల్దీప్ యాదవ్‌కి రెండు, జయదేవ్ ఉనద్కత్‌కు ఒక వికెట్ దక్కింది. శుభమన్ గిల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇషాన్ కిషన్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. ఈ విజయంతో భారత్ మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. ఇక ఈ సిరీస్ గెలవడం ద్వారా వరుసగా.. విండీస్ పై 13 ద్వైపాక్షిక సిరీర్ లు (2007-2023) గెలిచన జట్టుగా చరిత్ర సృష్టించింది భారత జట్టు. దీంతో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక ద్వైపాక్షిక సిరీస్ లు గెలిచి ప్రపంచంలోనే ఏకైక జట్టుగా టీమిండియా నిలిచింది.