అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో కార్చిచ్చు భీకరంగా మారింది. గంటల వ్యవధిలోనే… ఆ మంటలు శరవేగంగా వ్యాపిస్తున్నాయి. వేల హెక్టార్లలో అడవులు అంటుకుంటున్నాయి. దీంతో లాస్ ఏంజిల్స్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇప్పటికే వేలాది ఎకరాల్లోని విలాసవంతమైన ఇళ్లు కాలి బూడిదయ్యాయి. హాలీవుడ్ సెలబ్రిటీల ఇళ్లు సైతం కాలిపోయాయి. మరికొందరి ఇళ్లు కూడా కార్చిచ్చుకు సమీపంలో ఉన్నట్లు తెలుస్తోంది.
కొన్ని గంటల్లోనే 10 ఎకరాల నుంచి మూడు వేల ఎకరాల వరకు మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆదేశించినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. 13 వేల బిల్డింగ్‌లకి ప్రమాదం ఉన్నట్లు సమాచారం. హాలీవుడ్ నటులు ఉండే ప్రాంతాన్ని సైతం ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు.
మంగళవారం సాయంత్రం లాస్ ఏంజిల్స్‌లో దావానంలా మొదలైంది. గాలి తీక్షణంగా వీయడంతో… అడవి మంటలు వేగంగా వ్యాపించాయి. కాలిఫోర్నియా రాష్ట్రంలోని లక్షలాది మంది వార్నంగ జోన్‌లో ఉన్నట్లు తెలిపారు. తీవ్రమైన రీతిలో కార్చిచ్చు ప్రమాదం ఉన్నట్లు హెచ్చరించారు. లాస్ ఏంజిల్స్ కొండల్లో విస్తరిస్తున్న మంటల్ని అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది.
పసిఫిక్ పాలిసేడ్స్ అనే ప్రాంతంలో సుమారు 12 స్వ్కేర్ కిలోమీటర్ల అడవి కాలిపోయింది. శాంటి మోనికా, మాలిబు పట్టణాల మధ్య ఈ ప్రాంతం ఉంది. శక్తివంతమైన గాలులు వీయడంతో కార్చిచ్చు మరింత ప్రమాదకరంగా మారినట్లు అధికారులు చెబుతున్నారు. లాస్ ఏంజిల్స్ కౌంటీలోని 46 వేల ఇళ్లకి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆలట్‌డేనా ప్రాంతంలో సుమారు 200 ఎకరాల్లో అడవికి మంటలు అంటుకున్నాయి. హాలీవుడ్ నటులు యూజీన్ లెవి, జేమ్స్ వుడ్స్‌తో పాటు ఇతర సెలబ్రిటీలు ఇళ్లు వదిలి వెళ్లారు. ప్రాణాలు దక్కించుకునేందుకు కార్లు, సామన్లు వదిలేసి వెళ్లిపోయారు.