ప్రధాని మోదీ కేరళకు వస్తే చంపేస్తామని బెదిరింపులు రావడం సంచలనం రేపుతోంది. ఈనెల 24న మోదీ కేరళ పర్యటన నేపథ్యంలో ఆత్మహుతి దాడులకు పాల్పడతామని గుర్తు తెలియని వ్యక్తులు లేఖ రాయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేయడంతో పాటు హైఅలర్ట్ ప్రకటించారు.
ఈ బెదిరింపు లేఖ గత వారం బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రాగా.. ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ లేఖపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ ఏడీజీపీకి ఫిర్యాదుచేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ప్రధాని భద్రతకు సంబంధించిన ఏడీజీపీ జారీ చేసిన ఉత్తర్వులు లీక్ అయ్యాయి.
ఉత్తర్వులు లీక్ కావడంపై కేరళ బీజేపీ నేత, కేంద్ర సహాయ మంత్రి ఎం.మురళీధరన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తీవ్రమైన భద్రతా లోపమని మండిపడ్డారు. అయితే షెడ్యూల్ ప్రకారమే ప్రధాని పర్యటన కొనసాగుతుందని స్పష్టం చేశారు.