స్వతంత్ర వెబ్ డెస్క్: విశాఖ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటం, నేడు కూడా భారీ వర్ష సూచన ఉండడం తో పాఠశాలలను మూసివేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. విద్యార్థుల రవాణా, తరగతి గదుల నిర్వహణను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లిఖార్జున ఆదేశాలతో డీ ఈ వో చంద్రకళ ఈ నిర్ణయం తీసుకుంది. శిథిలావస్థలో ఉన్న గదుల్లో తరగతులు నిర్వహించవద్దని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అన్ని యాజమాన్య పాఠశాలలనూ మూసివేసేలా పర్యవేక్షించాలని ఎం ఈ వో, డెప్యూటీ డీ ఈ వో లకు ఆదేశించారు కలెక్టర్.
10 సెంటీ మీటర్ల వర్షానికే విశాఖ నగరం నీటిమయమైంది. నిరంతరాయంగా నిన్నటినుంచి కురుస్తున్న వర్షం ఒకవైపు మరొక వైపు డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడా సరిగా లేకపోవడంతో నీళ్లన్నీ విశాఖ నగర రోడ్లపైనే నిలిచిపోయాయి. దీంతో నగర వాసులకు నరకయాతన ఎదురయింది. పూడుకుపోయిన డ్రైనేజీలతో నీటి ప్రవాహం రోడ్లపైకి చేరి ముఖ్యమైన కూడళ్లు సైతం జలదిగ్బంధంలో కనిపించాయి. బీచ్ రోడ్ లో కూడా నీళ్ళు రోడ్ పైనే నిలిచిపోవడం, మరోవైపు డివైడర్ ల మధ్య చెట్లు నాటే క్రమంలో అక్కడకు తరలించిన మట్టి నీళ్లలో కలిసి ఎర్రగా మారి బీచ్ రోడ్ లో ఇరువైపులా ప్రవహిస్తుండడంతో చూడడానికే ఇబ్బందికరంగా మారింది.
దీనిని దృష్టిలో ఉంచుకునే ఈరోజు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అదే సమయంలో జ్ఞానపురం రైల్వే అండర్ బ్రిడ్జ్ సమీపంలో భారీగా నీళ్ళు నిలవడం, కార్లు కూడా మునిగిపోయే వరకు నీళ్ళు నిల్వ ఉండడం తో చాలా సేపటివరకు ఆ మార్గంలో వెళ్లేందుకు వాహన దారులు సంకొచించారు.