స్వతంత్ర వెబ్ డెస్క్: నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీలోని పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షం పడింది. ఇవాళ సాయంత్రం విజయవాడలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. గత రెండు వారాలుగా నగరంలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఎండ తీవ్రతకి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఇవాళ వర్షం కురవడంతో విజయవాడ ప్రజలు సేదతీరారు.
రాగల రెండు మూడు రోజుల్లో ద్వీపకల్ప దక్షిణ భారతంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని వివరించింది. తెలంగాణలో రాగల 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ప్రధానంగా ఈరోజు ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, జనగాం జిల్లాలలో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని సంచాలకులు హెచ్చరించారు.