సార్వత్రిక ఎన్నికలకు గెలుపు గుర్రాలను ప్రకటించింది బీజేపీ. ఎన్డీఏ కూటమి 400 ఎంపీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా పలువురు కీలక నేతలను బరిలో దింపింది. ఇందులో భాగంగానే 195 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ ప్రకటించింది. ప్రధాని మోడీ మరోసారి వారణాసి బరిలో దిగుతున్నారు. మహిళలు, యువతతోపాటు ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలకు చెప్పుకోదగిన స్థాయిలో సీట్లు కేటాయించారు కమలనాథులు. ఇక, మొదటి జాబితాలో తెలంగాణ నుంచి 9 మందికి చోటు దక్కింది.
సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకెళుతున్న బీజేపీ.. ఆ దిశగా చేసే ప్రయత్నాల్లో మరో కీలక అడుగు వేసింది. దేశవ్యాప్తంగా పార్టీ తరఫున పోటీ చేయనున్న 195 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నేత వినోద్ తావ్డే అభ్యర్థుల వివరాలు వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోడీ సారథ్యంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఇటీవలె సమావేశమై.. 16 రాష్ట్రాల్లోని అభ్యర్థిత్వాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలో ఆయా అభ్యర్థులను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ.
ప్రధాని నరేంద్రమోడీ వరుసగా మూడోసారి ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి బరిలో దిగబోతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్‌లోని గాంధీనగర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. యూపీలోని లఖ్‌నవు నుంచి రాజ్‌నాథ్ సింగ్, కేరళలోని త్రిస్సూర్ నుంచి ప్రముఖ నటుడు సురేష్ గోపీ అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. ఇక, బీజేపీ జాబితాలోని కీలక అంశాలను గమనిస్తే… 28 మంది మహిళలకు ఫస్ట్ లిస్ట్‌లో చోటిచ్చారు. యువతకు 47 స్థానాలు కేటాయించారు. ఎస్సీలకు 27, ఎస్టీలకు 18, ఓబీసీలకు 57 సీట్లు ప్రకటించారు. ఈ తొలిజాబితాలో 34 మంది కేంద్ర మంత్రులు చోటు దక్కించుకున్నారు.
తెలంగాణ నుంచి పోటీ పడుతున్న వారిలో 9 మంది కేండిడేట్ల పేర్లను ఫైనల్ చేసింది కమలం అధిష్టానం. తొలి జాబితాలో పేర్లు దక్కించుకున్న వారిలో కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజా మాబాద్ ధర్మపురి అర్వింద్ ఉన్నారు. ఇక, మల్కాజ్‌గిరి బరిలో ఈటెల రాజేందర్, జహీరాబాద్ స్థానం నుంచి బీబీ పాటిల్ చోటు సంపాదించారు. సికింద్రా బాద్ నుంచి మరోసారి కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. హైదరాబాద్ బరిలో డాక్టర్ మాధవీ లత, చేవెళ్ల నుంచి కొండా విశ్వశ్వర్ రెడ్డి, నాగర్ కర్నూలు స్థానం నుంచి పి. భారత్, భువనగిరి ఎంపీ స్థానం నుంచి బూర నర్సయ్య గౌడ్ పేర్లను ప్రకటించింది బీజేపీ. బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో బెంగాల్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, జార్ఖండ్ నుంచి ఎక్కువ మంది నేతలు చోటు సంపాదించారు.