స్వతంత్ర వెబ్ డెస్క్: స్వయం ఉపాధి పొందేలా సీఎం కేసీఆర్ ఇస్తున్న రూ.లక్ష బీసీబంధుని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. సిద్దిపేట వయోలా గార్డెన్స్‌లో ఆదివారం బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో కులవృత్తుల ప్రోత్సహం కోసం రూ.లక్ష గ్రాంట్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరై.. రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని 300 మంది లబ్ధిదారులకు చెక్కులు అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇది ఆరంభమని, నిరంతర ప్రక్రియ అన్నారు.
దశల వారీగా అర్హులైన వారందరికీ అందిస్తామన్నారు. కులవృత్తులను బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచించి.. వృత్తిపైన ఆధారపడిన వారందరికీ ప్రోత్సాహకంగా రూ.లక్ష గ్రాంట్ అందిస్తున్నారన్నారు. గత ప్రభుత్వాలు బ్యాంకు లింకేజీ పేరిట బీసీలకు ప్రభుత్వం 60 శాతం సబ్సిడీ, బ్యాంకులు 40శాతం పెడుతూ తదితర కొర్రీలతో ఎన్నో లింకులు ఉండేవి, ఆ రుణం కోసం షూరిటీ కావాలని తిరిగి తిరిగి చెప్పులరిగేవని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ఇవేమీ షూరిటీ, డాక్యుమెంట్స్ లేకుండా నేరుగా గ్రాంట్ రూపంలో రూ.లక్ష అందిస్తున్నారన్నారు.