వర్షం అంటే కర్షకులు హర్షం వ్యక్తం చేస్తారేమో కాని, భాగ్యనగర వాసులు మాత్రం వణికిపోతారు. చిన్న పాటి వర్షం వచ్చినా పెద్ద నదుల్లా రోడ్లు మారిపోవడమే నగరవాసుల భయానికి కారణం. వర్షబీభత్సానికి వాహనాలన్ని పడవల్లా మారి ప్రవాహంలో కొట్టుకుపోతుంటే నిస్సహాయంగా చూడడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. దీంతో జిహెచ్ఎంసి అధికారులు వాటర్ లాగిన్ పాయింట్స్ గుర్తించారు. అయితే, పాయింట్లు గుర్తించినా సమస్య పరిష్కారానికి సమగ్ర చర్యలు చేపట్టకపోవడం మైనస్ పాయింట్ గా మారింది.
వర్షాకాలానికి ముందే వరుణుడు గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ట్రైలర్ చూపించాడు. ఇటీవల హఠాత్తుగా కురిసిన వర్షాలకు నగరం తడిసి ముద్దయింది. చాలా కాలనీలు నీట మునిగాయి. నగర రోడ్లన్నీ నదులను తలపించాయి. గతంలో కురిసిన వర్షాల సమయంలో 200 కు పైగా వాటర్ లాగింగ్ పాయింట్లను జిహెచ్ఎంసి గుర్తించింది. అయితే, ప్రతి వర్షాకాలంలో మేజర్ జంక్షన్ల మధ్య భారీస్థాయిలో నీరు నిలిచిపోతూండడంతో వాహనచోదకులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అప్రమత్తమైన జిహెచ్ఎం సి వాటర్ స్టేగ్నేషన్ కు తావు లేకుండా చేయాలని నిర్ణయించింది
వర్షాకాలానికి బాగా ముందే కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లాలని అధికారులు నిర్ణయించుకు న్నారు. ఇందుకు అనుగుణంగా వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద ప్రమాదాలు జరగకుండా మ్యాన్ హోళ్లను సరిచేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ కిందికి వచ్చే బంజారాహిల్స్, జాబ్లీహిల్స్, వెంకటేశ్వరకా లనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్ డివిజన్ల పరిధిలో 18 చోట్ల వరద నీరు నిలిచిపోతోందని జీహెచ్ ఎంసీ గుర్తించి, వాటి వివరాలను జలమండలి అధికారులకు అందజేసింది. అదేవిధంగా ఖైరతాబాద్ జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, బంజారాహిల్స్, యూసుఫ్ గూడ, వెంగళరావునగర్, ఎర్రగడ్డ, బోరబండ, రహమత్ నగర్ డివిజన్ల పరిధిలో 113 చోట్ల వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించి జలమండలి అధికారులకు నివేదిక అందజేసింది. అటు ట్రాఫిక్ పోలీసుశాఖ ఇటు జీహెచ్ఎంసీ ఈ రెండు విభాగాల అధికారులు జైరతాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో 121 వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించడమే కాకుండా ఆ ప్రాంతాల పూర్తి వివరాలను జలమండలికి అప్పగించారు. వాటర్ లాగింగ్ పాయింట్లలో జలమండలికి చెందిన డ్రైనేజీ మ్యాన్ హోళ్ల మూతలు ఉన్నాయో లేదో, అక్కడ రక్షణ ఏర్పాట్లు ఎంతవరకు ఉన్నాయో పరిశీలించాలని సూచించారు.
గతంలో గుర్తించిన వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద సమస్యే ఇంకా పరిష్కారం కాలేదు. అధికారుల సమన్వయ లోపం వల్ల ఈ సమస్య పరిష్కారం కాలేదని తెలుస్తోంది. వర్షాకాలం ప్రారంభం కావడానికి మరొక రెండు వారాలు మాత్రమే మిగిలి ఉండడంతో ఈ సమయంలో అక్కడక్కడ వాటర్ లాగిన్ పాయింట్స్ వద్ద ఉన్న సమస్య పరిష్కారానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఈ వర్షా కాలంలో పూర్తిస్థాయిలో గ్రేటర్ సిటీ అంతా జల సమస్యలు పరిష్కారం అయ్యేలా కనిపించడం లేదని అధికారులు చర్చించుకుంటున్నట్టు తెలిసింది. రాబోయే వర్షాకాలంలో వాటర్ లాగింగ్ పాయింట్స్ వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున, ముందస్తుగానే ఆయా ఏరియాల్లో, ఆయా కాలనీల్లో సైన్ బోర్డులు పెట్టి ప్రజలను అప్రమత్తం చేయాలని గ్రౌండ్ లెవెల్ నుంచి సూచనలు వచ్చాయి. అయితే, ఆ దిశగా అడుగులు పడిన దాఖలా ఏమీ కనిపించడం లేదు. రాబోయే వర్షాకాలానికి ముందే జల సమస్యల పరిష్కారానికి, నాలాల మరమ్మతులకు అత్యవసర చర్యలు చేపట్టాలని ఉన్నతాధికా రులు ఆదేశాలు జారీ చేశారు. అయితే, గ్రౌవుండ్ లెవెల్లో ఆ పనులు నత్తనడకనే సాగుతున్నాయని తెలు స్తోంది. దీనిపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్ అనే సామెతను జ్ఞప్తికి తెచ్చుకుని, వర్షబీభత్సాలపై ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రజలు తెలియజేస్తున్నారు.