స్వతంత్ర వెబ్ డెస్క్: గత రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ -16 తుది దశకు చేరుకుంది. చివరి బంతితో ఫలితాలు, బ్యాట్స్ మెన్స్ విన్యాసాలు, బౌలర్ల స్టంట్‌లతో క్రికెట్ అభిమానులను రంజింపజేసింది లీగ్ దశలో అద్భుతంగా రాణించి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లే.. ఫైనల్‌లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. మే 28 (ఆదివారం) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. చెన్నై, గుజరాత్ మధ్య పోరుతో ప్రారంభమైన ఈ సీజన్.. ఆ రెండు జట్ల మధ్య పోరాటంతోనే ముగియనుండటం మరో విశేషం.
ఇంకా ఆరంభ వేడుకులనే ఘనంగా నిర్వహించిన బీసీసీఐ ముగింపు వేడుకలకు కూడా ప్రముఖ సెలబ్రిటీలను రప్పిస్తోంది బీసీసీఐ. ప్రముఖ ర్యాపర్స్ కింగ్ వివియన్ డివిన్, న్యుక్లెయ (ఉదయన్ సాగర్), కింగ్ (అర్పన్ కుమార్ చండెల్)తో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన జొనితా గాంధీ అభిమానులను అలరించనున్నారు. సాధారణంగా ముగింపు వేడుకలు మ్యాచు ప్రారంభానికి ముందే జరుగుతాయి. కానీ, ఈసారి మ్యాచు ప్రారంభానికి ముందు కొన్ని, తొలి ఇన్నింగ్స్ తర్వాత మరికొన్ని ప్రదర్శనలు ఉండనున్నాయి. తొలుత డివిన్, న్యుక్లెయర్‌ల ప్రదర్శన ఉండనుండగా.. కింగ్, జొనితా గాంధీలు ఒక ఇన్నింగ్స్ తర్వాత అలరించనున్నారు. దీంతో పాటు కనులు మిరమిట్లు గొలిపే లైటింగ్ షోను కూడా బీసీసీఐ ఏర్పాటు చేసింది.