స్వతంత్ర, వెబ్ సైట్: తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పెరుతో పెడుతున్న దుబారా ఖర్చును వెంటనే ఆపివేయాలని ఎమ్మార్ఫీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఎంఎస్ కాలేజీలో మందకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాధనం అనేది అత్యంత నిరుపేదలైన వారి సంక్షేమానికి ఉపయోగపడాలి.. అంతేకానీ జల్సాలకి, డిన్నర్లకి కాదని కెసిఆర్ ప్రభుత్వానికి గుర్తు చేశారు.
కేవలం ఓట్ల కోసమే ఈ దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారని పేర్కొన్నారు. తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలకు, తల్లిదండ్రులు ఎవరు తెలియని పిల్లలకు ప్రభుత్వమే తల్లి తండ్రి అని చెప్పి ,ప్రతి జిల్లాకు ఒక గురుకులాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి నేటికి 9 సంవత్సరాలు పూర్తయిందని వెంటనే గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
అనాధ పిల్లలకి ఆధార్ కార్డు , కుల సర్టిఫికెట్లు ఉండవు కాబట్టి వారికోసం ప్రత్యేకంగా స్మార్ట్ కార్డులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో చేసే ఖర్చును ఆపేసి అనాధ పిల్లల సంక్షేమం , విద్యా కోసం వెచ్చించాలని పేర్కొన్నారు. ఈరోజు నాలుగు వేలు రూపాయలు ఇస్తున్న పెన్షన్ స్వాగతిస్తూనే వికలాంగులతో పాటు అన్ని వర్గాల పింఛన్ దారులకు 6000 రూపాయల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.


