స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఈ యేడాది ఆఖరులో ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో అధికార, బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా, రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపింది. ఉపాధ్యాయ నియామక టెస్ట్ (టీఆర్టీ) ద్వారా ఏకంగా 5089 సాధారణ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టాల్సిందిగా ఆదేశించింది. వీటితో పాటు ప్రత్యేక ఆసరా పిల్లలకు సంబంధించి 1523 టీచర్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. మొత్తం మీద ఎన్నికల వేళ ఏకంగా 6612 పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చారు.
ఇదే విషయంపై ఆ రాష్ట్ర విద్యా శాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందిస్తూ, ఉపాధ్యాయ పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారా కాకుండా గతంలో మాదిరిగా జిల్లా ఎంపిక కమిటీలు (డీఎస్సీ) నియామకాలు చేపడతాయన్నారు. ఈ ప్రకారం టెట్ క్వాలిఫై అయిన వారంతా టీఆర్టీకి పోటీ పడేందుకు అర్హులని చెప్పారు. అందులో అర్హత సాధించిన వారి వివరాలతో జిల్లాలవారీ జాబితాను రూపొంచి డీఎస్సీకి పంపుతారని, అనంతరం ఆయా జిల్లాల డీఎస్సీలు నియామకాలు చేపడతారని తెలిపారు.


