స్వతంత్ర, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు చేస్తున్న అన్యాయంపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. కేంద్రానికి గిరిజనులపై ప్రేమ ఉంటే తెలంగాణ మాదిరిగా దేశంలో 10శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. నిజంగా గిరిజనులంటే గౌరవం ఉంటే ఢిల్లీలో కూడా సేవాలాల్ భవనాన్ని నిర్మించాలని కోరారు. సేవాలాల్ జయంతిని దేశవ్యాప్తంగా అధికారికంగా జరిపించాలని కోరారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్‌లో ఆదివారం జరిగిన జాతీయ బంజారా మీట్ 2023 కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. ఎస్టీలు మాట్లాడే గోర్ మాటి భాషను 8వ షెడ్యూల్లో చేర్చాలని కోరారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలోని గిరిజనులకు స్వర్ణయుగం వచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 3,144 తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడం.. రూ.2వేల కోట్లతో గిరిజన ఆవాసాలకు రోడ్లు వేయించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. వచ్చే నెలలో గిరిజనులకు పోడు భూములు పట్టాలు అందిస్తున్నామని తెలియజేశారు.