స్వతంత్ర వెబ్ డెస్క్: పేదవాడు వైసీపీ పార్టీని ఓన్ చేసుకోవాలని పిలుపునిచ్చారు సీఎం జగన్. పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లతో క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్. జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్.జగన్ మాట్లాడుతూ…. దసరా పండుగ నేపథ్యంలో, పండుగ ముగించుకుని అక్టోబరు 26 నుంచి బస్సు యాత్ర మొదలుపెట్టాలని ఆదేశించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ సమావేశాలు జరగాలని.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలనుంచి ప్రతి రోజూ ఒక మీటింగు చొప్పున మొత్తంగా మూడు మీటింగులు నిర్వహించాలన్నారు. ఇది అత్యంత ముఖ్యమైన కార్యక్రమం, అత్యంత విజయవంతంగా మీటింగులు జరిగేలా చూడాలి. స్థానిక ఎమ్మెల్యే లేదా పార్టీ ఇన్‌ఛార్జి సహా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నాయకులు ఈ సమావేశాల్లో మాట్లాడాలని.. 52 నెలల పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద వర్గాలకు చేసిన మేలును ఈ మీటింగుల ద్వారా వివరించి ఆయా వర్గాలకు మరింత చేరువ కావాలని వెల్లడించారు. వచ్చే ఎన్నికలు పేదవాడికి, పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం… జరుగుతున్నది కులాల వార్ కాదు, ఇది క్లాస్ వార్ అన్నారు. పేదవాడు మన పార్టీని ఓన్ చేసుకోవాలని.. వచ్చే రెండు నెలలపాటు ఈ బస్సు యాత్ర జరగాలిని ఆదేశించారు.