తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఏసీబీ దూకుడు పెంచింది. అక్రమాస్తుల సంపాదన, స్కామ్‌లపై ఫోకస్ చేస్తూ ఒక్కొక్కటిగా అన్నింటి చిట్టాను వెలికితీస్తోంది. ఓ వైపు దర్యాప్తు వేగవంతం చేస్తూ…మరోవైపు అరెస్టులతో అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. తాజాగా గొర్రెల పంపిణీ పథకంలో నలుగురిని అరెస్ట్ చేసింది ఏసీబీ. అసలు ఈ పథకం ఉద్దేశం ఏంటి…? ఎంత మందికి లబ్ధి చేకూర్చిందో వివరాల్లోకి
వెళదాం.
తెలంగాణ గొర్రెల పంపిణీ పథకంలో అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ పథకంలో అవినీతికి పాల్పడిన నలుగురు ప్రభుత్వ అధికారులను ఏసీబీ అరెస్టు చేసింది. వీరు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి బినామీ బ్యాంక్ ఖాతాల్లోకి గొర్రెల పంపిణీ పథకం నిధులను తరలించినట్లు దర్యాప్తులో తేలింది. నలుగురు నిందితులకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో అవినీతి ప్రకంపనలు రేపుతోంది. గొర్రెల పంపిణీ స్కీమ్ స్కామ్‌లో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై.. నకిలీ పత్రాలు, బ్యాంక్ ఖాతాలు సృష్టించి 2.10 కోట్ల ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించారని ఏసీబీ అధికారుల దర్యాప్తులో తేలింది. అరెస్టైన వారిలో కామారెడ్డి వెటర్నరీ ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ రవి, మేడ్చల్ పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిత్య, రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి రఘుపతిరెడ్డి, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ గణేష్ ఉన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత ప్రభుత్వంలో వివిధ శాఖలు, పథకాల్లో జరిగిన అవినీతిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్తు రంగాలకు సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తుండగా.. గొర్రెల పంపిణీ పథకంలోనూ అక్రమాలు జరిగినట్లు తేలడం ఆందోళన కలిగిస్తోంది. 12వేల కోట్ల బడ్జెట్‌తో 2017 జూన్ 20న నాటి సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ సమీపంలోని కొండపాకలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఒక్కో యూనిట్‌కు 21 గొర్రెలకు గాను లక్షా 25వేల ఇచ్చారు. ఆ తర్వాత యూనిట్ ధరను లక్షా 75వేలకు పెంచారు. ఇందులో లక్షా 31వేల 250ను రాష్ట్ర ప్రభుత్వం భరించగా..43వేల 750ను లబ్దిదారుడు భరించారు.
ఈ పథకంలో పొందిన గొర్రెలు ప్రమాదవశాత్తూ మరణిస్తే ప్రభుత్వం ఒక్కో గొర్రెకు 5,000 ఇన్సూరెన్స్ ఇచ్చింది. పొట్టేలుకు 7 వేల ఇన్సూరెన్స్ అందించింది. గొర్రెలు చనిపోయిన 10 రోజుల్లోనే ఈ ఇన్సూరెన్స్ డబ్బులను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. ఈ పథకంలో పలు దశల్లో అక్రమాలు జరిగినట్లు వెలుగులోకి వస్తున్నాయి. గొర్రెల పంపిణీ కుంభకోణానికి సంబంధించిన కేసును ఏసీబీ దర్యాప్తు చేస్తోంది.తెలంగాణ రాష్ట వ్యాప్తంగా పశు సంవర్ధక శాఖలో అవినీతికి పాల్పడిన నలుగురు నిందితులకు నాంపల్లి ACB కోర్టు మార్చి 7 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. వైద్య పరీక్షల అనంతరం నలుగురు నిందితులను చంచల్ గుడా జైలుకి తరలించారు ఏసీబీ అధికారులు. ఈ స్కామ్ కు సంబంధించిన అధికారులు ఇంకా ఎంత మందిని అరెస్ట్ చేస్తారో చూడాలి మరి.


