25.6 C
Hyderabad
Wednesday, February 5, 2025
spot_img

ఫార్ములా-ఈ కారు రేసు కేసు – విచారణ ఎదుర్కొన్న కారు పార్టీ చిన్న సారు..!

రాజకీయాల్లో ఎన్నో పక్షాలు ఉన్నా.. పాలకపక్షం, ప్రతిపక్షం నడుమ వైరం నిత్యకృత్యం అయ్యింది. సహజంగానే జరుగుతుందో, అసహజంగానే జరుగుతుందో కాని… రాజకీయ పార్టీ అధికార పార్టీగా మారిందంటే చాలు…ప్రతిపక్ష పార్టీ నేతల తప్పుల చిట్టా బయటకు వచ్చేస్తుంది. వాళ్ల హయాంలో ఇన్నిన్ని తప్పులు జరిగిపోయాయని, ఇంతంత ప్రజా ధనం వృధా అయిపోయిందని, అవినీతి, బంధుప్రీతి, పక్షపాతం..ఇలా ఎన్నో ఎన్నో ఆరోపణలు, నిందలు విపక్షం ఎదుర్కోవల్సి వస్తుంది. మళ్లీ వీళ్లు వాళ్లయినప్పుడు, వీళ్లు అందలం ఎక్కినప్పుడు..సేమ్ ఇదే తంతు. ఎక్కడైనా, ఎప్పుడైనా.. అధికార, విపక్షాల మధ్య ఇదే జరుగుతోంది. వాగ్బాణాలు, విమర్శనాస్త్రాలు, మాటల యుద్ధాలు..పేర్లు ఏవైనా ఈ తంతులన్నీ జరుగుతుంటాయి. ఈ తతంగాల్లో కేసులు, అరెస్టులు, బెయిళ్లు..ఎన్నెన్నో జరిగిపోతాయి. వీళ్లల్లో తప్పొప్ప్పులు, నిజానిజాల మాట ఎలా ఉన్నా వీటన్నింటివల్ల ప్రజలకు ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదు. ఎందుకంటే…అయిదేళ్ల తరువాత వీళ్లు, వాళ్లు.. వాళ్లు, వీళ్లు అయినప్పుడు, కేసులు, గొడవలు అన్ని రివర్స్ అవుతాయి. ఈ విషయంలో రాజకీయ నేతలు ఎవ్వరూ ఎవ్వరికీ తీసిపోరు. ఇదే విషయం ఎన్నో సందర్భాల్లో రుజువు అవుతోంది.

వైరం అనే మాట వినబడగానే వైరల్ అవ్వడం ఖాయం. పూర్వం ఏదో అంతంత మాత్రంగా రేడియోల్లో ఈ వార్తలు వస్తే.. ఇప్పుడు క్షణాల్లో వీడియోలుగా, ఎలక్ట్రానికి మీడియాల్లో, సోషల్ మీడియాల్లో వైరస్ లా ఇవి వైరల్ అయిపోతున్నాయి. వైరల్ వీడియాలపై వ్యాఖ్యానాలు, సొంత కథనాలు, నిందలు, నిష్ఠూరాలు, పొగడ్తలు, తెగడ్తలు, విమర్శలు, ప్రతి విమర్శలు.. అబ్బో బోల్డు బోల్డు వచ్చేస్తున్నాయి. చివరకు వైరానికి కారకులైన రెండు పక్షాలు ఏకమై మొత్తుకున్నా.. ఆ వైరల్ కాష్టానికి ఆగే పరిస్థితి ఉండదు. అయితే, ఎట్టిపరిస్థితుల్లో వైరి పక్షాలు రెండు ఏకం అవ్వవు అనేది వేరే విషయం.

కారు పార్టీ చిన్న సారు, ఫార్ములా-ఈ కారు రేసు కేసులో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఫార్ములా-ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీంతో ఆగ్రహం చెందిన గులాబీ శ్రేణులు..రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నాటకాలు ఆడుతోందని, ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపు కేసు అని మండిపడ్డాయి. ఈ కేసులో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలని కేటీఆర్ హైకోర్టును అభ్యర్థించారు. కేటీఆర్ అభ్యర్థనను హైకోర్ట్ నిరాకరించి, ఫార్ములా-ఈ కారు రేసు కేసులో ఈడీ, ఏసీబీ విచారణకు హాజరు కావాల్సిందేనని పేర్కొంది. దీంతో, హైకోర్ట్ పైకోర్టు అయిన సుప్రీం కోర్టుకు కేటీఆర్ వెళ్లారు. సుప్రీంలో క్వాష్ పిటిషన్ వేశారు. అయితే, ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం తేల్చి చెప్పింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, జస్టీస్ బేలా త్రివేది, జస్టీస్ పీబీ వర్గేతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. దీంతో, క్వాష్ పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు. అకారణంగా, అన్యాయంగా ఓ వ్యక్తి లేదా వ్యక్తులపై క్రిమినల్ కేసు, ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తే.. ఆ వ్యక్తి లేదా వ్యక్తులు హైకోర్ట్, సుప్రీం కోర్టులను ఆశ్రయించవచ్చు. అది తప్పుడు కేసు అని భావిస్తే న్యాయస్థానం దాన్ని కొట్టివేయవచ్చు. బాధితులు తమ న్యాయవాది ద్వారా కోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు. విచారణ ముగిసేలోపు, తీర్పు వెలువడేలోపు క్రిమినల్ కేసును రద్దు చేయడం లేదా ముగించడాన్ని చట్టపరమైన భాషలో క్వాషింగ్ గా చెబుతారు.

ఈ కేసులో తొలుత కేటీఆర్ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ, ఈ కేసులో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13.1 ఏ వర్తించదని, కేటీఆర్ సొమ్ములు తీసుకున్నారని ఎవరూ ఆరోపించలేదని అన్నారు. ఏసీబీ ఎఫ్‌ఐఆర్ లో పేర్కొన్న అంశాలు విధానపరమైన లోపాలకు సంబంధించినవని తెలిపారు. ఇది రాజకీయ కక్ష సాధింపు కేసు అని అన్నారు. ఫార్ములా ఈ రేసుల ద్వారా రాష్ట్రం గత ఏడాది ఏడు వందల కోట్ల రూపాయలు ఆర్జించినట్టు తెలిపారు. ఈ రేసులు కొనసాగించేందుకు కేటీఆర్ ప్రయత్నించారని తెలిపారు. విచారణ దశలో న్యాయస్థానం జోక్యం సరికాదన్న తెలంగాణ ప్రభుత్వ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం తెలియజేసింది. దీంతో, న్యాయపరమైన సలహాకు అనుగుణంగా పిటిషన్ ఉపసంహరించుకున్నామని బీఆర్ఎస్ తరఫు న్యాయవాది మోహిత్ రావు తెలిపారు.

కేటీఆర్ పై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పై సుప్రీంలో వేసిన క్వాష్ పిటిషన్ ను ధర్మాసనం డిస్మిస్ చేయలేదని బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇంచార్జ్ సోమ భరత్ కుమార్ తెలిపారు. న్యాయ నిపుణుల సూచనల మేరకే పిటిషన్ ను కేటీఆర్ తరఫు న్యాయవాది వెనక్కు తీసుకున్నారని తెలిపారు. దీనిపై దుష్ప్రచారం తగదన్నారు. హైదరాబాద్ ప్రతిష్ఠను పెంచేందుకే కేటీఆర్ ఫార్ములా-ఈ రేసు ఫార్ములాను తీసుకొచ్చారని, రాజకీయ కక్షతో ఆయనపై బూటకపు కేసు పెట్టారని ఆరోపించారు. తమకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని ఆయన అన్నారు. కేటీఆర్ ఏనాడు విచారణను వ్యతిరేకించలేదని చెప్పారు.

ఫార్ములా ఈ కారు రేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు గత నెలలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఏ ఫోర్స్ మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ,ఈసీఐఆర్ నమోదు చేశారు. కేటీఆర్ తదితరులపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ ఏక్ట్ , పీఎంఎల్ఏ తో పాటు ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్ మెంట్ ఏక్ట్ , ఫెమా కింద ఈడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. హెచ్ఎండీఏ జనరల్ ఖాతా నుంచి విదేశీ కంపెనీ అయిన ఫార్ములా-ఈ ఆపరేషన్స్ ,ఎఫ్ఈవో కు రెండు విడతలుగా దాదాపు 46 కోట్ల రూపాయలను విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించడంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ చెల్లింపులకు సంబంధించిన ఇన్ వాయిస్ లు, ఎఫ్ఈవో నుంచి అందిన తరువాత, కేటీఆర్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ప్రొసీడింగ్ ఆర్డర్ ఇచ్చానని బిఎల్ ఎన్ రెడ్డి ఇప్పటికే ఈడీ విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, ఏదైనా విదేశీ కంపెనీకి విదేశీ కరెన్సీలో సొమ్ము పంపించాలన్నప్పుడు రిజర్వ్ బ్యాంకు నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇలాంటి అనుమతులేవి పొందకుండా, క్యాబినెట్ నుంచి, ఆర్థిక శాఖనుంచి అనుమతులు లేకుండా నిధుల బదిలీపై ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఇందులో ఎవరి పాత్ర ఎంత అనే కోణంలో ఈడి అధికారులు ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది.

ఫార్ములా-ఈ కారు రేసు విచారణలో జోక్యానికి సుప్రీం నిరాకరించడంతో గులాబీ పార్టీలో గుబులు మొదలైనట్టు తెలుస్తోంది. ఈ కేసులో కేటీఆర్ ఈ నెల 9న ఏసీబీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. అయితే, ఏసీబీ అధికారుల ప్రశ్నలకు సమాధానాలిచ్చి సాయంత్రానికి కేటీఆర్ తిరిగి రావడంతో గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. అయితే, ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ రద్దు చేయాలంటూ కేటీఆర్ హైకోర్ట్ లో వేసిన పిటిషన్ ను తిరస్కరణ, ఇందులో జోక్యానికి సుప్రీం నిరాకరణ, సుప్రీంలో వేసిన పిటిషన్ ను కేటీఆర్ తరఫు న్యాయవాదులు వెనక్కు తీసుకోవడంతో… అసలు ఏం జరగబోతోందన్న ఉత్కంఠ ఆ పార్టీ వర్గాల్లో నెలకొన్నట్టు సమాచారం. ఇదే కేసులో ఏ2 గా ఉన్న ఐఏఎస్ అధికారి, నాటి పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలను ఈడీ అధికారులు ఇప్పటికే ప్రశ్నించారు. అయితే, ఏ1 ఉన్న కేటీఆర్ ను ఈడీ ఇప్పుడు మరోసారి విచారించింది.

ఫార్ములా-ఈ రేస్‌ కేసులో విచారణకు కేటీఆర్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఎదుట హాజరయ్యారు. అంతకుముందు ఆయన గచ్చిబౌలిలోని నివాసం నుంచి బయలుదేరి.. నేరుగా ఈడీ కార్యాలయానికి చేరారు. అనంతరం ఆయన ఒక్కరే బషీర్‌బాగ్‌ ఈడీ ఆఫీసులోకి వెళ్లారు. వాస్తవానికి ఈ నెల 7న ఆయన హాజరుకావాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల తాను రాలేనని కేటీఆర్‌ చెప్పడంతో ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు మరోసారి నోటీసులిచ్చారు. కేటీఆర్ ను ఈడీ అధికారులు విచారిస్తున్న సమయంలో కార్యాలయం బయట బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున జై తెలంగాణ నినాదాలు చేశారు. శాంతిభద్రతలకు భంగం కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

ఈడీ విచారణకు ముందు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ కేసు రాజకీయ కుట్ర అని కేటీఆర్ మండిపడ్డారు. ఈ కేసులో నిధుల దుర్వినియోగం ఆరోపణలను ఆయన ఖండించారు. హైదరాబాద్‌ నగరంలో ఫార్ములా ఈ రేసింగ్ ని హోస్ట్ చేయడం తమ హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయాల్లో ఒకటి అని అన్నారు. అంతర్జాతీయ రేసర్లు, ఇ-మొబిలిటీ పరిశ్రమల పెద్దలు హైదరాబాద్ నగరాన్ని ప్రశంసించటాన్ని తాను గర్వంగా భావిస్తున్నాని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ కుట్రలు తననేం చేయలేవని అన్నారు. ఎఫ్ఈవోకి 46 కోట్లు రూపాయలు బ్యాంక్-టు-బ్యాంక్ లావాదేవీ ద్వారా చెల్లించబడిందన్నారు. ఒక్క రూపాయి సైతం దుర్వినియోగం కాలేదని.. ప్రతి రూపాయికి క్లియర్‌గా లెక్క ఉందన్నారు. అసలు ఇందులో అవినీతి దుర్వినియోగం, మనీ లాండరింగ్ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. త్వరలోనే నిజాలు బయటికి వస్తాయని, తాము న్యాయ పోరాటాన్ని ఎప్పటికీ కొనసాగిస్తామని కేటీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు.

మరోవైపు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్, కేటీఆర్ తీరుపై మండిపడ్డారు. లోపల విచారణ జరుగుతుంటే బయట ఆందోళన చేపట్టడం ఏమిటని బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం చెందారు. లాయర్ తో విచారణకు వెళతాననడం కేటీఆర్ మూర్ఖత్వానికి పరాకాష్ట అని అన్నారు. న్యాయవాదితో విచారణకు వెళ్లాలంటే కోర్టు పర్మిషన్ ఉండాలనే విషయం తెలియదా..? అని నిలదీశారు. ఒకప్పుడు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కు ఆ మాత్రం తెలియదా అని ప్రశ్నించారు. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా డ్రామాలేమిటని ఫైరయ్యారు.

మొత్తం మీద ఈ వ్యవహారంలో హెచ్ ఎం డీ ఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీ, ఫెమా నిబంధనల ఉల్లఘనకు సంబంధించిన పలు అంశాలపై ఈడీ విచారించినట్టు తెలుస్తోంది. ఇంతకు ముందు అర్వింద్‌ కుమార్‌, బీఎల్‌ఎన్‌ రెడ్డి లను ప్రశ్నించిన ఈడీ అధికారులు ఇప్పుడు కేటీఆర్ ను రెండోసారి ఈ అంశంపై ప్రశ్నించారు. బ్యాంకు అధికారులతో పాటు పలువురు హెచ్‌ఎండీఏ అధికారులను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు.

Latest Articles

డ్యాన్స్ ను జయించిన క్యాన్సిల్…డామిట్ కథ అడ్డం తిరిగింది

నవమి నాటి వెన్నెల నేను, దశమి నాటి జాబిలి నీవు, కలుసుకున్న ప్రతి రేయి, కార్తీక పున్నమి రేయి...కాపురం కొత్త కాపురం, నువ్వు నేను ఏకమైనాము, ఇద్దరమూ మన మిద్దరమూ ఒక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్