స్వతంత్ర వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ సాగర్ రింగ్‌రోడ్డులో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ లో ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బైరామల్‌గూడ ఫ్లై ఓవర్ ర్యాంపు కుప్పకూలింది. రెడీ మిక్సర్ తయారు చేసే లారీ రివర్స్ తీసుకునే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. రెండు పిల్లర్లకు మధ్య నిర్మిస్తున్న ఓ స్లాబ్ కూలడంతో దానిపై పనులు చేస్తున్నపది మంది కార్మికులు గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారంతా బీహార్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారని వెల్లడించారు.
కాగా, అర్ధరాత్రివేళ ప్రమాదం జరగడంతో పెను ముప్పు తప్పింది. ప్రమాద స్థలాన్ని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దవాఖానలో చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న ఇంజినీర్ల బృందం.. ఫ్లై ఓవర్ కూలిపోవడానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. ఇక పొక్లెయిన్ సాయంతో శిధిలాలను తొలగిస్తున్నారు.