First Mobile Phone Call: ప్రస్తుతం మొబైల్ ఫోన్ లేని వ్యక్తి ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతలా మనిషి జీవితంలో ఫోన్ భాగమైపోయింది. ఏ అవసరం కావాలన్నా క్షణాల్లో తీర్చేస్తోంది ఫోన్. మనిషి మనుగడను ఎంతో సౌకర్యవంతంగా తీర్చిదిద్దింది. అలాంటి ఫోన్ ఎప్పుడు లాంఛ్ అయిందో తెలుసా. సరిగ్గా ఇదే రోజు ఏప్రిల్ 3,1973 సంవత్సరంలో మొట్టమొదటి మొబైల్ ఫోన్ తయారైంది. టెలిఫోన్ పరిచయమైన చాలా రోజుల తర్వాత మొట్టమొదటి ‘హ్యాండ్‌హోల్డ్ మొబైల్ సెల్‌ఫోన్’ను అమెరికన్ ఇంజినీర్ మార్టీ కూపర్ కనిపెట్టారు.
50ఏళ్ల కిందట ఇదే రోజు తన మొబైల్ ఫోన్ నుంచి తొలిసారిగా వేరే వ్యక్తికి కాల్ చేసి మాట్లాడారు. న్యూజెర్సీలోని బెల్ ల్యాబ్స్ హెడ్ క్వార్టర్స్ లో పనిచేసే తన సహచరుడు జోయెల్ ఎంజెల్‌కు కాల్ చేశారు. ప్రొటోటైప్ DynaTAC(డైనమిక్ అడాప్టీవ్ టోటల్ ఏరియా కవరేజ్)8000x సాయంతో తొలి వైర్ లెస్ ఫోన్ కాల్ చేశారు. 1973లో కాల్ చేసినప్పటికీ, ఫోన్ అసలు నమూనా రిలీజ్ అవ్వడానికి 11ఏళ్లు పట్టింది.
1.1 కిలోల బరువు ఉండే ఈ ఫోన్.. 22.86 సెంటీమీటర్ల పొడువు, 12.7 సెంటీమీటర్లు పరిమాణం, 4.44 సెంటీమీటర్లు వెడల్పు కలిగి ఉంది. కూపర్ కనిపెట్టిన మొబైల్ ఫోన్ కోసం 1973-1993 మధ్య కాలంలో మోటారోలా కంపెనీ 100 మిలియన్ డాలర్ల ఖర్చు పెట్టిందని ఈడీఎన్ నెట్ వర్క్ వెల్లడించింది.