చైనాలో విజృంభిస్తున్న హెచ్‌ఎంపీవీ వైరస్ ఇప్పుడు భారత్‌కు కూడా పాకినట్టు అనుమానం వ్యక్తమవుతోంది. బెంగళూరులో 8 నెలల చిన్నారికి హెచ్‌ఎంపీవీ సోకినట్టుగా అనుమానిస్తున్నారు. చిన్నారికి ఈ వైరస్ పాజిటివ్ గా తేలినట్టు జాతీయ మీడియా కథనాల్లో పేర్కొంటున్నారు. దీనిపై కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. రాష్ట్రంలోని ల్యాబ్‌లో ఈ పరీక్ష నిర్వహించలేదని.. ఆ రిపోర్టు ప్రైవేటు ఆస్పత్రి నుంచి వచ్చిందని తెలిపింది. ఇందులో తమకు ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేసింది. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి ఎలాంటి ధృవీకరణ రాలేదు.
చైనాలో వెలుగు చూస్తోన్న హెచ్‌ఎంపీ వైరస్‌పై భారత్ అప్రమత్తమైంది. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ మానిటరింగ్ గ్రూప్ పేర్కొంది. శీతాకాలంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగానే చైనాలో ఇన్‌ఫ్లూయెంజా, ఆర్‌ఎస్‌వీ, హెచ్‌ఎంపీవీ వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నాయని తెలిపింది. ఒకవేళ వ్యాధులు పెరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది.
అసలు HMPV వైరస్ ఏంటి?
HMPV ఇతర శ్వాసకోశ వైరస్‌ల మాదిరిగానే వ్యాపిస్తుంది. ముఖ్యంగా దగ్గినా, తుమ్మినా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. షేక్ హ్యాండ్, లేదా తాకడం వంటివి చేయకపోవడం మంచిది. కలుషితమైన ఉపరితలాలను తాకి.. అదే చేతితో నోరు, ముక్కు లేదా కళ్లను తాకినా వైరస్ వ్యాపిస్తుంది.
HMPVని ఎలా నిరోధించాలి?
1..చేతులను 20 సెకన్ల పాటు సబ్బుతో తరచూ కడుక్కోవాలి
2..చేతులు కడుక్కోకుండా ముఖాన్ని అంటుకోవద్దు
3..రోగులకు దూరంగా ఉండాలి
4..బొమ్మలు, టేబుల్స్, డోర్లను అంటుకుంటే తప్పకుండా చేతులు కడుక్కోవాలి
HMPV లక్షణాలు ఉన్నవారు ఏమి చేయాలి?
HMPV లేదా సాధారణ జలుబు లక్షణాలు ఉన్నవారు, సాధారణ పరిశుభ్రత పద్ధతులను అనుసరించడం వలన వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చు.
నోరు, ముక్కును కవర్ చేసుకోవాలి: తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు, డ్రాప్‌లెట్స్ చేరకుండా, వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి టిష్యూ వాడాలి
క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలి: కనీసం 20 సెకన్ల పాటు సబ్బు నీటితో తరచుగా చేతులు కడుక్కోవడం వలన వ్యాప్తిచెందే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
వ్యక్తిగత వస్తువులను పంచుకోవడం మానుకోండి: ఇతరులకు సోకే అవకాశాలను తగ్గించడానికి పాత్రలు, కప్పులు, ఇతర వ్యక్తిగత వస్తువులను ఒకరివి మరొకరు వాడొద్దు
ఇంట్లోనే ఉండండి: మీకు అనారోగ్యంగా అనిపిస్తే, వైరస్ ఇతరులకు వ్యాపించకుండా ఉండేందుకు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవడం మంచిది.
HMPVకి వ్యాక్సిన్ ఉందా?
ప్రస్తుతానికి, HMPVకి నిర్దిష్ట యాంటీవైరల్ చికిత్స, వ్యాక్సిన్ లేదు. వ్యాధి సోకిన వారికి డాక్టర్ దగ్గరకు వెళ్లి చికిత్స తీసుకోవాలి. లక్షణాలను తగ్గించడం, రోగులకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి