స్వతంత్ర వెబ్ డెస్క్: భోపాల్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రభుత్వ శాఖలకు చెందిన అనేక ఆఫీసులున్న సాత్పూరా భవనంలో ప్రమాదం జరిగింది. ఎయిర్‌ఫోర్స్, స్థానిక అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి సుమారు 14గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. సాత్పూరా భవన్ లోని 3వ ఫ్లోర్‌లో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో చెలరేగిన మంటలు వేగంగా పైనున్న అన్ని అంతస్థులకు వ్యాపించాయి. మంటలు వ్యాపిస్తున్న క్రమంలో ఎయిర్ కండీషనర్లు, గ్యాస్ సిలిండర్లు పేలిపోవడంతో మంటల తీవ్రత బాగా పెరిగిపోయిందని అధికారులు ప్రకటించారు. సాత్పూరా భవనంలో మంటలు చెలరేగిన గిరిజన సంక్షేమ శాఖలోని ఫైళ్లతోపాటు వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన పలు ఫైళ్లు ఇతర శాఖలకు చెందిన ఫైళ్లు సైతం దగ్ధమయ్యాయని అధికారులు ప్రకటించారు.
భారత వైమానిక దళానికి చెందిన విమానం AN-52, MI-15 ఛాపర్ డౌసింగ్ ఆపరేషన్‌లో చేరి పై నుండి బకెట్లను ఉపయోగించి నీటిని పోశాయి. ప్రమాద సమయంలో సకాలంలో భవనంలోని అధికారులు, సిబ్బందిని ఖాళీ చేయించడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని.. ఎవరికి ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రధాని నరేంద్ర మోదీకి, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కి, హోంమంత్రి అమిత్ షాలకు సమాచారం అందించారని.. మంటలను ఆర్పేందుకు కేంద్ర సహాయాన్ని కోరినట్టు రాష్ట్రానికి చెందిన ఒక అధికారి తెలిపారు.