స్వతంత్ర వెబ్ డెస్క్: తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రైల్వే స్టేషన్ సమీపంలోని గోవిందరాజు స్వామి ఆలయం సమీపంలోని లావణ్య ఫొటో ఫ్రేమ్స్ షాపులో మంటలు చెలరేగాయి. రద్దీగా ఉండే ప్రాంతంలో ప్రమాదం జరగడం.. మంటలు ఇళ్ల వైపు వ్యాపిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఐదంతస్తుల భవనంలోని ఓ ఫ్లోర్‌లో ఫొటో ఫ్రేమ్ వర్క్స్ దుకాణం నిర్వహిస్తున్నారు. అందులో విద్యుదాఘాతంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు రూ.50లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. మూడు అగ్నిమాపక వాహనాల్లో సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు భవనం ముందు ఉన్న ఐదు ద్విచక్ర వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. మంటలు చెలరేగడంతో ఫొటో ఫ్రేమ్ వర్క్స్ దుకాణంలో పనిచేస్తున్న సిబ్బంది వెంటనే బయటకు పరుగులు తీశారు. భవనంలో ముగ్గురు వ్యక్తులు చిక్కుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.